మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ వేడిని రోజురోజుకూ పెంచుతోంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ నేపథ్యంలో ఆదివారం గట్టుప్పల్ మండలంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సారథ్యంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై రెచ్చిపోయారు.
ఈ రోజు ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోందన్నారు. అటువంటి పౌరుషమైన రక్తం ఈ గడ్డదన్నారు. దేనికైనా సిద్ధమని, తగ్గేదే లేదన్నారు. త్వరలో యుద్ధం జరగబోతోందన్నారు. ఇది ఒక వ్యక్తి కోసమో, పదవి కోసమో, పార్టీ కోసమో జరుగుతున్నది కాదన్నారు. ఇది తెలంగాణ భవిష్యత్ కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వస్తున్న ఎన్నిక అన్నారు. ఇది తన కోసం వచ్చిన ఎన్నిక కాదని స్పష్టం చేశారు.
తాను పదవిని త్యాగం చేసినట్టు చెప్పుకొచ్చారు. భవిష్యత్ తెలంగాణ తరాల కోసం వచ్చిన ఎన్నికగా అభివర్ణించారు. ఒక కుటుంబం నుంచి నాలుగు కోట్ల ప్రజల విముక్తి కోసం వచ్చిన ఎన్నిక అని అభివర్ణించారు. ఇది ఎన్నిక కాదు, ధర్మ యుద్ధమన్నారు. ఈ యజ్ఞంలో భాగస్వాములై ధర్మాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ధర్మం ప్రజల్ని కాపాడుతుందన్నారు. స్వార్థం కోసమైతే టీఆర్ఎస్‌లోకి వెళ్లే వాడినన్నారు. కుటుంబ పాలన పోవాలని, బడుగు, బలహీన వర్గాలకు అధికారం దక్కాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానన్నారు. అది కేవలం మోదీ, అమిత్‌షా నాయకత్వం వల్లే సాధ్యమన్నారు.
రాజకీయాల్లోకి రాకముందు రేవంత్‌రెడ్డి దొంగతనాలు చేసేవాడన్నారు. అతనికి చరిత్ర లేదన్నారు. మహబూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి కుటుంబ చరిత్ర ఏంటో తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు. అతనో చిల్లర దొంగ అని ఘాటు విమర్శ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి, పదవిని అడ్డు పెట్టుకుని, సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని, పెద్దలను బెదిరించి వందల కోట్లు సంపాదించిన చరిత్ర రేవంత్‌దని విరుచుకుపడ్డారు.
పదవిని త్యాగం చేసి ప్రజల కోసం ఎన్నికలకు వెళుతున్న చరిత్ర తనదన్నారు. అలాంటి తనను, తన కుటుంబం అమ్ముడుపోయిందని మాట్లాడుతున్న వారి గురించి ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏ కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు పోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసమా? ఓటుకు నోటు కేసులోనా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.