ఎవరెన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, అలాంటి వారికి టీడీపీ ప్రభుత్వం రాగానే కీలక పదవులు ఇస్తామని అనేక సందర్భాల్లో నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. తనపై కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా కేసులే పెట్టిందని గర్వంగా చెప్పారు. అదేంటో గానీ, ఇప్పుడు కేసులంటే లోకేశ్ బెంబేలెత్తిపోతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆయనలో భయం మొదలైంది. అన్యాయం, అక్రమం అంటూ ఆరోపిస్తున్నారు.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం, 50 రోజుల తర్వాత ఆయన మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు జైల్లో ఉండగా, లోకేశ్ ఎక్కువ కాలం ఢిల్లీకే పరిమితం అయ్యారు. కేసులకు భయపడి లోకేశ్ పారిపోయారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అయితే తన తండ్రి కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించడానికే ఢిల్లీ వెళ్లినట్టు లోకేశ్ చెప్పారు. అయినా లోకేశ్ భయపడ్డారనే ప్రచారమే జనాల్లోకి బలంగా వెళ్లింది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ తమ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు చేయడం గమనార్హం. గవర్నర్‌కు ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు లేకుండా రోజుల తరబడి జైల్లో పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేతలపై 260 కేసులు, అలాగే కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు.
బాబుపై ఆధారాల్లేకుండా అక్రమ కేసు, అలాగే ఏపీలోకి జనసేనాని పవన్‌కల్యాణ్ అడుగు పెట్టకుండా అడ్డుకోవడంపై గవర్నర్‌కు వివరించినట్టు లోకేశ్ తెలిపారు. భయం తమ బయోడేటాలో లేదని లోకేశ్ సినిమా డైలాగ్‌లు చెప్పడం విశేషం. సైకోను ఎదుర్కోడానికి సన్నద్ధత ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. అడ్డొస్తే తొక్కు కుంటూ పోతామని, ప్రజలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. వేల కేసులు తమ వాళ్లపై పెట్టారని లోకేశ్ చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం వస్తే, ఎంత మందికి ఎన్ని పదవులు ఇస్తారో చూడాలనే సెటైర్ విసురుతున్నారు.