స్కిల్ స్కామ్‌లో అరెస్టయి , రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా చంద్రబాబు ఉన్నారు. ఇటీవల ఆయనకు న్యాయ స్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం… అనారోగ్యం. కంటి ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారని, కావున బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తికి న్యాయ స్థానం సానుకూలంగా స్పందించింది.
నాలుగు వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ నెల 28న తిరిగి జైలుకు వెళ్లాల్సి వుంటుందని న్యాయ స్థానం స్పష్టం చేసింది. అయితే ఈ లోపు చంద్రబాబు ఆరోగ్యంగా వుంటే సరి, లేదంటే మరికొంత కాలం బెయిల్‌ను పొడిగించే అవకాశం వుంది. చంద్రబాబుకు ఏదో ఒక అనారోగ్యం వస్తుందని , ఆయన మధ్యంతర బెయిల్‌పై మరికొంత కాలం ఇంటిపట్టునే వుంటూ, రాజకీయాలు చేస్తారని టీడీపీ నేతలు ఆశతో వున్నారు. దేన్నీ కొట్టి పారేయలేం.
ఇదిలా వుండగా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు మంగళవారం కుడి కంటి ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఆపరేషన్ చేసినట్టు సమాచారం. ఆపరేషన్ అనంతరం ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. గతంలో ఆయన ఎడమ కంటికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ ముగియడంలో చంద్రబాబు ఏ అవసరం కోసం వచ్చారో, ఆ పని నెరవేరిందనే చర్చకు తెరలేచింది.
ఇటీవల విప్లవ కవి వరవరరావు కంటి ఆపరేషన్‌కు కేవలం ఐదు రోజులు మాత్రం న్యాయ స్థానం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సరోజిని ఆస్పత్రిలో వరవరరావు కంటి ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగి ముంబయ్‌కి వెళ్లిపోయారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ ముగించుకుని , ఒకట్రెండు రోజుల్లో రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేయనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.