ఓటు వేయడానికి వెళ్లిన సీఎంకు ఈవీఎం షాక్ ఇచ్చింది. సాంకేతిక లోపంతో ఈవీఎం పని చేయకపోవడంతో ఓటు వేయకుండానే ముఖ్యమంత్రి వెనుతిరిగిన ఘటన మిజోరంలో చోటు చేసుకుంది. ఇవాళ మిజోరం రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పోలింగ్ జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
ఈ నేపథ్యంలో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయడానికి వెళ్లగా ఈవీఎం మొరాయించడంతో షాక్కు గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు కూడా అయిన ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం పని చేయకపోవడంతో తాను కొంత సమయం వేచి ఉన్నట్టు చెప్పారు.
అయినప్పటికీ యంత్రం పని చేయలేదన్నారు. దీంతో నియోజకవర్గంలో తిరిగి, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓటు వేయడానికి వస్తానని చెప్పారు. ఆ తర్వాత ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని అధికారులు పరిష్కరించారు. ఈ విషయం తెలిసి తిరిగి పోలింగ్ కేంద్రానికి సీఎం వెళ్లారు. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు.