లోకేశ్ పాదయాత్రకు అనివార్య పరిస్థితుల్లో వరుసగా మూడు రోజులు విరామం ప్రకటించాల్సి వచ్చింది. పాదయాత్రను తిరిగి 21వ తేదీ ప్రారంభించనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పంలో మొదలైన ఆయన పాదయాత్ర అవిశ్రాంతంగా 22 రోజుల పాటు సాగింది. ఈ నెల 17వ తేదీ నాటికి ఆయన పాదయాత్ర 22 రోజులు పూర్తి చేసుకుంది. అప్పటికి ఆయన 296 కిలోమీటర్లు నడిచి విడిదికి చేరుకున్నారు.
18వ తేదీ మహా శివరాత్రిని పురస్కరించుకుని పాదయాత్రకు విరామం ప్రకటించారు. దురదృష్టవశాత్తు మహాశివరాత్రి రోజే తారకరత్న తుదిశ్వాస విడిచినట్టు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. దీంతో 19వ తేదీన లోకేశ్ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. తారకరత్నకు నివాళులర్పించారు. 20న తారకరత్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన పాదయాత్ర విడిది ప్రాంతమైన శ్రీకాళహస్తికి పయనమయ్యారు. రాత్రికి విశ్రాంతి తీసుకుని తిరిగి మంగళవారం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. మూడు రోజుల విరామం అనంతరం ఆయన మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. పాదయాత్రలో భాగంగా 23వ రోజు శ్రీకాళహస్తిలోని ఆర్టీవో ఆఫీస్ ఎదుట విడిది కేంద్రంలో ముస్లింలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. సాయంత్రం కోబాక విడిది కేంద్రంలోని బస కేంద్రానికి చేరుకుంటారు.