లాస్ట్ చాన్స్ కామెంట్‌…లోకేశ్ ఫైర్‌!

క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబునాయుడు త‌న‌కు లాస్ట్ చాన్స్ కింద అధికారం ఇవ్వాల‌ని కోర‌డం టీడీపీలో అసంతృప్తి ర‌గుల్చుతోంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బాబు త‌న‌యుడైన లోకేశ్ తీవ్రంగా రియాక్ట్ అయిన‌ట్టు…

క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబునాయుడు త‌న‌కు లాస్ట్ చాన్స్ కింద అధికారం ఇవ్వాల‌ని కోర‌డం టీడీపీలో అసంతృప్తి ర‌గుల్చుతోంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బాబు త‌న‌యుడైన లోకేశ్ తీవ్రంగా రియాక్ట్ అయిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తాను ఉండ‌గా… అధికారం రాక‌పోతే, టీడీపీ ఉండ‌ద‌ని ఎలా అంటార‌ని చంద్ర‌బాబును లోకేశ్ ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది.

2004 నుంచి ప‌దేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నామ‌ని, తిరిగి 2014లో అధికారంలోకి రాలేదా? అని చంద్ర‌బాబును లోకేశ్ ప్ర‌శ్నించిన‌ట్టు టీడీపీలో అంతర్గ‌తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. పాద‌యాత్రకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో త‌న నాయ‌క‌త్వాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేలా “లాస్ట్ చాన్స్” కామెంట్ వుంద‌ని బాబుతో లోకేశ్ అన్న‌ట్టు తెలిసింది. అదేదో త‌న‌తోనే టీడీపీ అంత‌మ‌వుతుంద‌నే సంకేతాల్ని చంద్ర‌బాబు లాస్ట్ చాన్స్ కామెంట్ తీసుకెళ్లింద‌ని లోకేశ్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

లోకేశ్ నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం, భావోద్వేగాన్ని పండించైనా అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో చివ‌రి అవ‌కాశం ఇవ్వాల‌ని అడిగిన‌ట్టు చంద్ర‌బాబు స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లన్నీ భూమ‌రాంగ్ అయ్యాయ‌ని టీడీపీ నేత‌లు ఒప్పుకుంటున్నారు. తాను రాజ‌కీయాల్లో వుండాలంటే టీడీపీని గెలిపించాల‌ని కోర‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌.

చంద్ర‌బాబు త‌నను తాను గొప్ప‌గా ప్ర‌జ‌ల ఎదుట ఆవిష్క‌రించుకునే క్ర‌మంలో చివ‌రికి కుమారుడికి కూడా విలువ లేకుండా చేస్తున్నార‌నే వాస్త‌వాన్ని ఆయ‌న గ్ర‌హించ‌డం లేద‌ని లోకేశ్ స్నేహితులు వాపోతున్నారు. త‌న‌తోనే పార్టీ అంత‌మ‌వు తుంద‌న్న‌ట్టు బాబు గ‌గ్గోలు పెట్ట‌డం లోకేశ్‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేద‌ని ఆయ‌న స్నేహితులు చెబుతున్నారు. లోకేశ్‌లో జోష్ నింపాల్సిన చంద్ర‌బాబు, అందుకు విరుద్ధంగా పొంత‌న లేని మాట‌లు మాట్లాడ్డం ఏంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ని టీడీపీ శ్రేణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి.