ఏ పార్టీలోనైనా సరే ఎవరైనా ఒక నాయకుడు పార్టీ ఫిరాయిస్తున్నాడని ప్రచారం జరిగితే లేదా పుకారు వస్తే వెంటనే తీవ్రంగా మండిపడతాడు. ఇదంతా అసత్య ప్రచారం అంటాడు. పార్టీ ఫిరాయించే లక్షణం తన రక్తంలోనే లేదంటాడు. కానీ ఓ శుభ ముహూర్తాన వేరే పార్టీలోకి జంప్ అయిపోతాడు. ఇలాంటి ప్రహసనం జరగడం సర్వ సాధారణం. సేమ్ ఇలాగే చేశాడు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి రాజకీయ వారసుడు, కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి శశిధర్ రెడ్డి.
తెలంగాణా రాజకీయాల్లో మర్రి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారడానికి కారణం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద అసంతృప్తే. దాంతో బీజేపీలో చేరిపోతున్నాడు. ఆ పార్టీలో ఈయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో చెప్పలేం. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం రెండు రోజుల కిందట ఒక్క సారిగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారని బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిసి ఆ పార్టీలో చేరుతారని ఒక్క సారిగా గుప్పుమంది. అయితే ఈ ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు.. వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
తాను ఢిల్లీకి వెళ్లడం కొత్త కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చినట్లు చెప్పారు. తానింకా రాజకీయాల్లో ఉన్నానని, రిటైర్ కాలేదని అన్నారు. తాను వచ్చిన విమానంలో అన్ని పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. తాను బీజేపీలో చేరేందుకే ఢిల్లీకి వచ్చానంటూ పుకార్లు పుట్టించడం సరికాదన్నారు. ఇలా మాట్లాడిన ఈ నాయకుడు మంచి ముహూర్తం చూసుకొని బీజేపీలో చేరతానని క్లారిటీ ఇచ్చాడు.
మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరూ హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి సోదురల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని ఆయన తప్పుబడ్డారు. ఒక దశలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ ఎమ్మెల్యే టిక్కెట్ తనకే లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దీనిపై బీజేపీ పెద్దలు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయినా పార్టీ మారారు. పార్టీలో చేరికను బీజేపీ పెద్దలు స్వాగతించినట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ తిరిగొచ్చాక తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడి మంచిరోజున పార్టీలో చేరుతానని శశిధర్ రెడ్డి అన్నట్లు సమాచారం.
చెన్నారెడ్డి మరణం తరువాత ఆయన వారసుడిగా కాంగ్రెస్ అధినాయకత్వంతో శశిధర్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ మాట చెల్లుబాటు అవుతున్న సమయంలో దివగంత నేత పీ జనార్ధన్ రెడ్డి – మర్రి శశిధర్ రెడ్డి సన్నిహితంగా ఉండేవారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మర్రి శశిధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
1992 ఉప ఎన్నకతో పాటుగా 1994 ,2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014 ఎన్నికల్లో నాడు టీడీపీ నుంచి పోటీ చేసిన తలసాని చేతిలో శశిధర్ రెడ్డి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సనత్ నగర్ టీడీపీకి కేటాయించారు. మరోసారి తలసాని టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తే…తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారిని టీఆర్ఎస్ నేతలు తిరిగి తమ పార్టీలోకి తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు.
ఇక, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న మర్రి కుటుంబం నుంచి ఇప్పుడు సీనియర్ నేత బీజేపీలో చేరటం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారుతోంది.