మూడేళ్లుగా పగ పెంచుకున్నాడు. పైకి మాత్రం స్నేహం నటించాడు. మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. టైమ్ రానే వచ్చింది. గొంతు కోసి హత్య చేశాడు. స్నేహం ముసుగులో జరిగిన ఈ మర్డర్, వేములవాడలో కలకలం సృష్టించింది.
వేములవాడకు చెందిన శ్రీధర, బాబు స్నేహితులు. ఓ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ ఘర్షణల్లో బాబుకు చెందిన బైక్ ను శ్రీధర్ తగలబెట్టాడు. మూడేళ్ల కిందటి ఘటన ఇది.
అప్పట్నుంచి బాబు, శ్రీధర్ పై కక్ష పెంచుకున్నాడు. బైక్ తగలబెట్టాడనే కక్ష మనసులో ఉన్నప్పటికీ, పైకి మాత్రం స్నేహంగానే ఉన్నట్టు నటించాడు. అలా మూడేళ్లుగా అదను కోసం ఎదురుచూస్తున్నాడు.
ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. మందు కొడదాం అంటూ శ్రీధర్ ను శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు బాబు. శ్రీధర్ కు బాగా మద్యం తాగించాడు. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశాడు.
భర్త ఎప్పటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీధర్ భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించి బాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మనసులో పగ పెంచుకొని, ఓ వ్యక్తిని చంపడం కోసం మూడేళ్లుగా ఎదురుచూడడం, దాని కోసం స్నేహంగా నటించడం లాంటివి తెలుసుకొని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.