నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం రసకందాయంలో పడింది. టీడీపీ ఇన్‌చార్జ్ అఖిలప్రియకు ముఖ్యంగా భూమా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మద్దతు కరువవుతోంది. తాజాగా పొత్తులో భాగంగా తన మద్దతు ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్ భూమా కిషోర్‌రెడ్డికే అని టీడీపీ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ఆత్మ ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించడం విశేషం.
ఇటీవల భూమా కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి తమ కుటుంబ వారసుడిగా కిషోర్‌ను ఎన్నికల బరిలో దింపనున్నట్టు ప్రకటించారు. అఖిలప్రియకు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ మద్దతు లేదని వారంతా తేల్చి చెప్పారు. భూమా పేరుతో అఖిలప్రియ చెలామణి కావడం సబబు కాదని భూమా కుటుంబ సభ్యులు అన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిని మంగళవారం ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జ్ కిషోర్‌రెడ్డి కలుసుకున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల రాజకీయాలపై వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు నేపథ్యంలో నంద్యాల జిల్లాలో పెను రాజకీయ మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆ ఇద్దరు నాయకులు తెలిపారు. తనను కిషోర్ కలిసిన సందర్భంలో ఏవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు ఖరారవుతోందని, ఆళ్లగడ్డ టికెట్ కిషోర్‌కు ఇస్తారని అన్నారు. తన మద్దతు ఎప్పటికీ కిషోర్‌కే వుంటుందని ఆయన స్పష్టం చేశారు.
అఖిలప్రియకు కాకుండా భూమా కుటుంబంలో టికెట్ ఎవరికిచ్చినా మద్దతు ఇస్తానని పలుమార్లు టీడీపీ అధిష్టానానికి చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మరోసారి అదే విషయాన్ని చెబుతున్నట్టు ఆయన తెలిపారు. దివంగత భూమా నాగిరెడ్డి దంపతులకు ఏవీ సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు. నాగిరెడ్డి మరణానంతరం ఏవీతో అఖిలప్రియకు విభేదాలు వచ్చాయి. చివరికి ఏవీని అంతమొందించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అఖిలప్రియకు ఆళ్లగడ్డలో వ్యతిరేకత దృష్ట్యా ఆమెకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్న నాయకుల్లో ఏవీ సుబ్బారెడ్డి ఒకరు. ఇప్పుడాయన మద్దతు భూమా కిషోర్‌రెడ్డికి ప్రకటించడం చర్చనీయాంశమైంది.