ఎన్నో నెలలు వస్తూంటాయి. క్యాలండర్ లో అవి అలా గిర్రున తిరిగి వెనక్కిపోతూంటాయి. అయితే దాదాపుగా నాలుగేళ్ళ పాలనకు చేరువ అవుతున్న వైసీపీ సర్కార్ మార్చిలో మంచి వర్తమానం అంటోంది. అది విశాఖకు గుడ్ న్యూస్ అని ఊరిస్తోంది.
మార్చి 2023లో విశాఖకు అతి పెద్ద శుభవార్త వైసీపీ సర్కార్ చెప్పబోతోంది అని అంటున్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. మార్చి నెల నుంచి విశాఖలో రాజధాని కార్యకలాపలు మొదలవుతాయని ఆయన కడు నమ్మకంగా చెబుతునారు.
విశాఖలో పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుందని ఆయన ఘంటాపధంగా అంటున్నారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ శాసనసభా రాజధాని ఉంటుందని, అలాగే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని, ఆ నెల నుంచి విశాఖ దశ దిశా మొత్తం మారిపోతుందని అంటున్నారు.
ప్రస్తుతానికి చూస్తే వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని మీద వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది. మరో మూడు నెలలలో ఈ కేసు పరిష్కారం అయి తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఏమైనా ఆశలు వైసీపీలో ఉన్నాయా అని అంటున్నారు.
అది కాకపోయినా రాజధాని అని పేరు పెట్టకుండా ముఖ్యమంత్రి క్యాంప్ అఫీస్ తో విశాఖకు వచ్చి మార్చి నుంచి పాలన చేస్తారు అని చెప్పడమే ఎమ్మెల్యే ఉద్దేశ్యమా అన్నది చూడాలి. ఎన్నో మార్చిలు వచ్చాయి కానీ ఈ మార్చి విశాఖకు ప్రత్యేకం అని వైసీపీ నేతలు అంటున్నారు అంటే ఆ మంచి కోసం వేచి చూడాల్సిందే.