ఏపీలో మొత్తంగా చూసుకుంటే బీజేపీకి ఎంతో కొంత బలం ఉన్నది విశాఖలోనే. ఆ పార్టీ తరఫున బడా నాయకులు కూడా ఎపుడూ ఇటు వైపే ఫోకస్ పెడతారు. ఈ మధ్యనే ప్రధాని నరెంద్ర మోడీ రెండు రోజుల పాటు విశాఖలోనే విడిది చేసి వెళ్ళారు.
విశాఖకు పొరుగు జిల్లానే తూర్పుగోదావరి. అక్కడ నుంచి వచ్చి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఎదిగిన సోము వీర్రాజు ఎన్నో సార్లు విశాఖ వచ్చారు వెళ్ళారు, రెండున్నరేళ్ళుగా ఆయన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. అయినా ఆయన ఎవరో ఇంకా చెప్పుకోవాలా అన్నదే కమలం పార్టీలో వీర్రాజు అనుచరుల బాధగా ఉందిట.
విశాఖకు తాజాగా వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్మయోగి కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో పాల్గొనడానికి వచ్చిన సోము వీర్రాజును లోపలికి వెళ్ళనీయకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వీర్రాజు ఫైర్ అయి తానెవరో చెప్పుకోవాలా. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నా పంపరా అంటూ వాదించారు.
ఈ తతంగం చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఐఎస్ఎఫ్ సిబ్బందికి చెప్పి ఆయనకు లోపలకు తీసుకువచ్చేలా చూశారు. ఒక విధంగా వీర్రాజుకు ఇది అవమానం అని అంటున్నారు. ఇదే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ తో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కూడా వీర్రాజు తన గురించి తాను చెప్పుకుని పరిచయం చేసుకున్నారు. దాని మీద ఆయనకు యాంటీగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వార్తలు వండి అవమానం చేసింది. చూడబోతే అందరికీ అందంగా కనిపించే విశాఖ వీర్రాజుకు అచ్చిరావడం లేదా అని అనుకుంటున్నారుట.