ఎన్ని సార్లు చెప్పినా అదే వైఖరి. అదే ధోరణి. మాట వినరా.. భవిష్యత్తు గురించి అసలు పట్టించుకోరా అంటూ మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరి వెంకటకుమారి ఆవేదనతో కూడిన ఆవేశాన్ని జనాల మీద ప్రదర్శించారు. నోరు నొప్పి వచ్చేలా చెబుతున్నా చెవులకు ఎక్కించుకోరేమి అని ఆమె ఫైర్ అయ్యారు.
విశాఖ నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నాట్లుగా భారీ ప్రకటన చేశారు. అయినా చాలా చోట్ల ఇంకా వాడకం కనిపిస్తోంది. దీంతో వివిధ వార్డులలో పర్యటనకు వెళ్ళిన మేయర్ అక్కడ దర్శనమిచ్చిన ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలను చూసి తట్టుకోలేకపోయారు.
విశాఖ నుంచే కదా సీఎం ప్లాస్టిక్ ఫ్లెక్సీల మీద నిషేధం విధించింది అయినా కూడా బుర్రలకు ఎక్కించుకోకపోతే ఎలా అంటూ ఆమె అక్కడ వారి మీద మండిపడ్డారు. ప్లాస్టిక్ వల్ల అనర్ధాలు వస్తున్నాయని పర్యావరణానికి ముప్పు అని చెబుతున్నా ఆలకించకపోతే ఎలా అని ఆమె స్థానికులను నిలదీశారు.
వెంటనే ప్లాస్టిక్ ఫ్లెక్సీలను కట్టిన వారి మీద చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. విశాఖలో మూడు నెలలుగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. సీఎం జగన్ కొద్ది రోజుల క్రితం నగారానికి వచ్చి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఇక వద్దు అని స్పష్టంగా చెప్పారు.
ఏపీలో విశాఖ ప్లాస్టిక్ మీద యుద్ధం ప్రకటించి ముందు వరసలో ఉంది. దానికి మేయర్ కార్పోరేషన్ అధికారులు చిత్తశుద్ధితో తీసుకుంటున్న చర్యలే కారణం. తాజాగా ఫ్లెక్సీల మీద మేయర్ కన్నెర్ర విశాఖకు ఒక గట్టి హెచ్చరికగా పనిచేస్తుందని అధికారులు అంటున్నారు.