చంద్రబాబునాయుడు అదృష్టవంతుడు. ప్రజాకర్షక నేత కాకపోయినా, పరిస్థితులు ఆయనకు అనుకూలంగా వుంటూ వస్తున్నాయి. ప్రశ్నించడానికి, సమాజంలో మార్పు తీసుకురాడానికి జనసేన అనే పార్టీని పెట్టానని చెప్పిన పవన్‌కల్యాణ్… చివరికి చంద్రబాబు పల్లకీ మోయడానికి మరోసారి సన్నద్ధం అయ్యారు. జనసేన పార్టీ పెట్టిన వెంటనే ఆయన చేసిన పని కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
2014లో ఏపీలో టీడీపీ -బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి, గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. కనీసం కొన్ని సీట్లైనా తీసుకోకుండా పోటీ చేయడం పవన్‌కల్యాణ్‌కే చెల్లింది. ఆ తర్వాత ఏవో కారణాలతో ఆ రెండు పార్టీలకు దూరమై, 2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసి రాజకీయంగా చావుదెబ్బ తిన్నారు. గత అనుభవాల దృష్ట్యా పవన్ గుణపాఠం నేర్చుకుని సొంతంగా ఎదుగుతారని జనసేన శ్రేణులు ఆశించాయి. పవన్‌ను సీఎంగా చూడాలనేది జనసైనికుల ఆకాంక్ష.
ఇటీవల పవన్ అన్న, మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే ఆకాంక్షను బయటపెట్టారు. పాలకుడిగా పవన్‌ను చూడాలని వుందని, ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన మద్దతు పవన్‌కు వుంటుందని కూడా ఆయన ప్రకటించారు. కానీ పవన్‌లో తాను పాలకుడు కావాలనే పట్టుదల లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు పవన్‌కల్యాణ్ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారో కూడా ఆయనకే తెలియని పరిస్థితి.
పార్టీకి మాత్రం జనసేన అనే అందమైన పేరు పెట్టారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా ఆ పార్టీ పరిస్థితి ఉంది. జనసేన కాస్త చంద్రబాబు పల్లకీసేనగా మారింది. పార్టీ అధినేతగా చంద్రబాబుకు ఊడిగం చేస్తూ, ఆయన అధికార పల్లకీని మోయడానికే పవన్‌కు ఇష్టమని ఎవరైనా విమర్శిస్తే మాత్రం చాలా కోపం వస్తుంది. తనతో పాటు నమ్ముకున్న జనసైనికులు, అలాగే సినీ అభిమానుల ఆశలు, ఆకాంక్షలను చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేన లేకపోతే ఒక వ్యక్తిగా మాత్రమే చంద్రబాబును భుజాన మోసేవాడు. అలాకాకుండా పార్టీగా బాబు అధికార పల్లకీ మోయాలని పవన్‌కల్యాణ్ ఉత్సాహం ప్రదర్శించడం అంటే, కార్యకర్తలు, నాయకులందరి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడమే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తన అన్న చెప్పిన మాటల్ని కూడా పవన్ మనసుకెక్కించుకోలేదు.
ఎంతసేపూ చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా పవన్ రాజకీయ పంథా వుంటోంది. ఆ ధోరణే జనసేనను పల్లకీసేనగా, బాబు భజనసేనగా మారుస్తోందనే విమర్శలను కొట్టి పారేయగలరా?