జనసేనాని పవన్‌కల్యాణ్ గత ఏడాదిగా టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జనసేన వార్షిక సభలో పవన్ ఆవేశంతో ఊగిపోతూ… వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ అధినాయకత్వం రోడ్‌మ్యాప్ ఇవ్వాలని కోరారు. దాని కోసం ఎదురు చూస్తుంటానని చెప్పారు. నాడు ఆ మాటలు ఎందుకు చెప్పారో, నేడు బాబు భేటీతో క్లారిటీ వచ్చింది.
టీడీపీతో కలిసేందుకు, మిత్రపక్షమైన తమ నుంచి విడిపోయేందుకే రోడ్‌మ్యాప్ అడిగారని బీజేపీ నేతలు చెబుతున్నారు. జగన్‌ను ఓడించేందుకు బీజేపీ రోడ్‌మ్యాప్ ఇవ్వకపోవడం వల్లే పొత్తు చిత్తు అయ్యిందనే నెపాన్ని జాతీయ అధికార పార్టీపై వేసేందుకు పవన్‌కల్యాణ్ పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారనే వాస్తవం నేటి పరిణామాలతో బయటపడింది. టీడీపీతో ముందే మాట్లాడుకుని ఓ పద్ధతి ప్రకారం బీజేపీకి దూరంగా వుంటూ వస్తున్నారు. విశాఖ ఎపిసోడ్ మొదలు, చంద్రబాబు భేటీ వరకూ అన్నీ టీడీపీ కనుసన్నల్లో జరిగాయనేందుకు పవన్ మాటలే నిదర్శనం.
చంద్రబాబుతో కలిసేందుకే రోడ్‌మ్యాప్‌ను సాకుగా చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబుతో భేటీకి ముందు కార్యకర్తల సమావేశంలో పవన్ ఏమన్నారంటే…
“బీజేపీని రోడ్ మ్యాప్ కోరటంపై ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి నేతలు విస్మయం వ్యక్తం చేశారు. ఇంత మంది అభిమానులుండగా బీజేపీని రోడ్ మ్యాప్ అడగడం ఏంటని పెద్దలు తిడితే ఆశీర్వాదంగా భావించాను. బీజేపీతో పొత్తు కుదిరినా బలంగా పని చేయలేకపోయాం. రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే నాకు కాలం గడిచిపోతుంది. వైసీపీ రౌడీ రాజ్యం నుంచి నా ప్రజలను రక్షించుకోడానికి వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. తప్పడం లేదు. అంత మాత్రాన బీజేపీకి, ప్రధానికి వ్యతిరేకం కాదు” అని పవన్‌కల్యాణ్ అన్నారు.
వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తోందని, చంద్రబాబుతో తప్పని సరి పరిస్థితుల్లో కలుస్తున్నానని, పొత్తు రద్దు చేసుకున్నంత మాత్రాన బీజేపీకి, మోదీకి శత్రువు కాదని పవన్‌కల్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుతో భేటీకి, పొత్తు సంకేతాలు ఇచ్చేందుకు అంతా పథకం ప్రకారమే జనసేనాని నడుచుకుంటున్నారని అర్థం చేసుకోడానికి ఇంతకంటే ఏం కావాలి? బీజేపీ ఎటూ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వదని తెలిసే పార్టీ వార్షిక సభలో పవన్ ప్రత్యేకంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. తాను అనుకున్నట్టే బీజేపీ వ్యవహరించిందని ఆయన సంబరపడ్డారు.
ఎన్నికలకు సమయం ముంచుకొస్తోందని పవన్ అదును చూసి, చంద్రబాబుతో భేటీ అయ్యారు. అందుకే ఆయన సమయం మించిపోతోందని బీజేపీకి ప్రత్యేకంగా గుర్తు చేయడం. పవన్‌ను బీజేపీ నేతలు అర్థం చేసుకున్నారో, లేదో తెలియడం లేదు. కానీ బీజేపీ చెవిలో పవన్ పే…ద్ద కమలం పువ్వు పెట్టారనేది వాస్తవం. బాబుతో కలిశానని, అంత మాత్రాన బీజేపీకి, ప్రధానికి శత్రువు కానని చెప్పడం ద్వారా …ఇక పొత్తు లేదని పరోక్షంగా చెప్పారు. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీనే.
ఒకవేళ తనపై బీజేపీ విమర్శలకు దిగితే… రోడ్ మ్యాప్ అస్త్రాన్ని ప్రయోగించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. జగన్‌ను గద్దె దించడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే విడిపోవాల్సి వచ్చిందనే వాదాన్ని బలంగా వినిపించడానికి ఆయన రెడీ.