వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, మరికొందరు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు, ఆమధ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని వైసీపీ వర్గం సమర్థంగానే తిప్పికొట్టింది. అయితే అదంతా ఒకెత్తు. ఈరోజు వైసీపీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి చేసిన స్టేట్ మెంట్ మరో ఎత్తు.
టీడీపీ నుంచి దాదాపు అంతా తమవైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుతానికి గోప్యంగా ఉంచిన ఈ విషయాల్ని త్వరలోనే వెల్లడిస్తాం అనే అర్థం వచ్చేలా కాకాణి స్టేట్ మెంట్ ఇచ్చారు.
“తెలుగుదేశం పార్టీలో ఎవరినైతే చేర్చుకోవడానికి ఇష్టంలేక మేం దూరం పెడుతున్నామో వాళ్లు తప్ప, మిగిలిన వాళ్లంతా కూడా వైసీపీలో దాదాపు చేరిపోయినట్టే. రాజకీయాల్లో గోప్యం ఉండాలి. అప్పుడే మనకు చెందిన నేతలు మనవైపు వస్తారు.”
తాజాగా మంత్రి అయిన కాకాణి ప్రకటనను లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఆయనకున్న సర్కిల్ అలాంటిది. కాకాణి మాటలే నిజమైతే మాత్రం టీడీపీకి మరిన్ని కష్టాలు తప్పవు. మరోవైపు లోకేష్ పై కూడా అంతే సూటిగా స్పందించారు కాకాణి. ఎలాంటి అర్హత లేని లోకేష్ కామెంట్స్ చేస్తే, వాటిపై స్పందించాలా అని ప్రశ్నించారు.
“లోకేష్ లాంటి వ్యక్తి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన అర్హత ఏంటి. ఆయనేమైనా హరిత విప్లవం సాధించాడా. రైతులకు ఎప్పుడైనా అండగా నిలిచాడా. అసలు ఆయనకు వ్యవసాయం గురించి తెలుసా. చంద్రబాబు కొడుకు అయినంత మాత్రాన, ఆయనకు హైప్ క్రియేట్ చేస్తే, ఆయన మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు.”
టీడీపీ నుంచి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ వైపు వచ్చారు. పార్టీ కండువా కప్పుకోనప్పటికీ, వైసీపీ సానుభూతిపరులుగా తమనుతాము ప్రకటించుకున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలొస్తున్నాయి. కాకాణి ప్రకటన చూస్తుంటే, టీడీపీ నుంచి కనీసం మరో ఐదుగురు వైసీపీలోకి వచ్చేలా ఉన్నారు.