జనాలు ఎగబడ్డారు బకెట్లతో బీరు నింపుకొని ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు కూడా జనాలు ఎగబడ్డారు బిందెలతో నూనె నింపుకున్నారు. ఎంచక్కా ఇంటికెళ్లారు. ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు ఆసక్తి రేకెత్తించాయి.
అసలే ఎండాకాలం. చల్లగా ఓ బీరు పడితే బాగుంటుందని చాలామంది మందుబాబులకు కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ల ముందు ఏకంగా బీరు బాటిల్స్ తో ఓ లారీ కనిపిస్తే ఎలా ఉంటుంది? కేసుల కొద్దీ బీరుసీసాలు కళ్లముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో జరిగింది.
సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద బీరుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్తుండగా.. మూలగుంటపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న బీరు బాటిళ్లన్నీ రోడ్డుపై పడ్డాయి చాలా బాటిల్స్ పగిలిపోయాయి. మిగిలిన వాటిని జనాలు ఎత్తుకెళ్లారు. కొంతమంది బకెట్లలో బీరు నింపుకొని మరీ ఇళ్లకు తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రోడ్డు క్లియర్ చేశారు.
ఇలాంటిదే మరో ఘటన ముంబయి అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగింది. వంట నూనె లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. వేల లీటర్ల నూనె రోడ్డు పాలైంది. ట్యాంక్ నుంచి లీక్ అవుతున్న మిగతా ఆయిల్ కోసం జనం ఎగబడ్డారు. అసలే దేశంలో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి.
ఇలాంటి టైమ్ లో రోడ్డుపై నూనె కనిపించడంతో జనాలు ఎగబడ్డారు. చేతిలో ఏది దొరికితే వాటి నిండా ఆయిల్ నింపుకొని పరుగులుపెట్టారు.మరికొంతమంది దగ్గర్లోనే ఉన్న కిరాణా షాపులో కూల్ డ్రింక్ బాటిల్స్ కొని, వాటిని పడేసి, ఖాళీ బాటిల్స్ లో ఆయిల్ నింపుకున్నారు. సమీపంలో ఉన్న గ్రామస్తులైతే బిందెలు పట్టుకొని ఎగబడ్డారు.