తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ గర్జించాడు. ఎందుకు గర్జించాడు అంటే జాతీయ రాజకీయాల్లో తాను సింహం కావాలనుకుంటున్నాడు. పదిహేను రోజులు తన ఫామ్ హౌజ్ లో ఉండి ఒక్కరోజు పల్లె పట్టణ ప్రగతి సమీక్షా సమావేశం నిర్వహించి ఆ తరువాత రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ముందుగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అక్కడ సీఎం కేజ్రీవాల్ ను, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కలుసుకున్నారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నారని సమాచారం.
కేసీఆర్ కూడా రాజకీయ నాయకులు కలుసుకుంటే రాజకీయాలు కాకుండా ఇంకేం మాట్లడుకుంటారని మీడియాను ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరిందే రాజకీయాలు మాట్లాడడానికే. అందులో సందేహం లేదు. ఆయన ఢిల్లీలో మీడియాతో దేశంలో సంచలనం జరగబోతున్నదని చెప్పారు. అది జరిగి తీరుతుందని గట్టిగా నొక్కి వక్కాణించారు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడండి అని కూడా అన్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలతో ప్రత్యామ్నాయం ఏర్పాటవుతుందని చెప్పారన్న మాట. ఆ సంచలనం వేరెవరోకాదు తానే సృష్టిస్తానని కేసీఆర్ మాటల సారాంశం. అంటే కేసీఆర్ మళ్ళీ గర్జించారని అనుకోవాలి.
తెలంగాణలో 2018 ఎన్నికలకు ముందు మొదలైన ఆయన గర్జన మధ్య మధ్య విరామంతో కొనసాగుతూనే ఉంది. ఇక ప్రధాని మోడీ మీద, బీజేపీ మీదా నిప్పులు కక్కుతున్నారు. ఆయన రాష్ట్రానికి వస్తే స్వాగతం కూడా చెప్పడంలేదు. ఈ నెల 26న మోడీ హైదరాబాదుకు వస్తున్నారు.
ఆయనకు స్వాగతం చెప్పడం ఇష్టంలేక వెంటనే రాష్ట్రాల పర్యటన పెట్టుకున్నారని విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ తరువాత అంతటివాడు ఆయన కుమారుడు కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ పరిశీలించారు.
కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్‌కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్‌కు వివరించారు. పాఠశాలలో అందుతున్న అధునాతన వసతుల గురించి కేసీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను వీక్షించిన కేసీఆర్... విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని కొనియాడారు.
కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని అన్నారు. కేజ్రీవాల్ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులను ఢిల్లీ పాఠశాలలకు పంపిస్తామ.. ఢిల్లీ బోధనా విధానాలను అధ్యయనం చేయాలని చెప్తామని కేసీఆర్ తెలిపారు.
ఢిల్లీ బోధనా విధానాలు దేశం మొత్తానికి ఆదర్శనీయమన్నారు. దేశంలో మరెక్కడా ఇటువంటి విద్యా విధానం లేదని ప్రశంసించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం ఏకపక్షంగా ఉండరాదన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు, సంప్రదింపులు ఉండాలి.
విద్యా విధానం దేశానికి అవసరమే… కానీ, ఒకరు రూపొందించి అందర్నీ అమలు చేయాలనడం సరికాదు. కేంద్రం ఏ కొత్త విధానమైనా అయినా తీసుకురావొచ్చు. ఆ విధానం తీసుకువచ్చే ముందు కేంద్రం, అన్ని రాష్ట్రాలతో చర్చించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదంతా అలా ఉంచితే కేసీఆర్ చెప్పిన సంచలనం ఏమిటో జరిగి తీరుతుందా? అదేమిటో మీరే చూస్తారని ఆయన చెప్పారు కాబట్టి ఏం జరుగుతుందో చూసి తీరాల్సిందే.