ఎడా పెడా వాయించేసి…పండుగ చేసుకోమంటారా…?

మోడీ మాస్టార్ అంకెల గారడీని జనం నమ్మడంలేదు అంటున్నారు ఎర్రన్నలు. ఆయన గత ఏడేళ్ళుగా ఎడా పెడా  ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్ డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. అవి అసాధారణ స్థాయిలోకి వెళ్ళిపోయాయి.…

మోడీ మాస్టార్ అంకెల గారడీని జనం నమ్మడంలేదు అంటున్నారు ఎర్రన్నలు. ఆయన గత ఏడేళ్ళుగా ఎడా పెడా  ఇబ్బడి ముబ్బడిగా పెట్రోల్ డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. అవి అసాధారణ స్థాయిలోకి వెళ్ళిపోయాయి. అలా పెంచేసిన వాటిని ఇపుడు సడెన్ గా  ఆరేడు రూపాయలు తగ్గిస్తే బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకోవడం ఏంటని కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు.

మోడీ ప్రధాని అయిన నాటిని పెట్రోల్ అరవై రూపాయలు లీటర్ ఉండేదని, డీజిల్ యాభై రూపాయల లోపు ఉంటే గ్యాస్ సిలిండర్ నాలుగు వందల దగ్గర ఉండేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇపుడు ధరలు తగ్గించామని చెబుతున్నా కూడా గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలకు పైగా ఉందని అంటున్నారు. మరి ఇది తగ్గింపా డబుల్ వాయింపా అని నిలదీస్తున్నారు.

అలాగే ఈ రోజుకు 120 రూపాయల దాకా పెట్రోల్ పెంచేసి ఆరేడు రూపాయలు తగ్గిస్తే లాభమేంటి అని అంటున్నారు. మోడీ సర్కార్ ధరలను అన్నీ కూడా పూర్తిగా తగ్గించాలని వామపక్ష పార్టీలు విశాఖలో డిమాండ్ చేశాయి. ఏడేళ్ళుగా అదే పనిగా పెంచేసిన ధరలు అన్నీ రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

అపుడే పేదల మీద, సాదా సీదా ప్రజల మీద మోడీ సర్కార్ కి నిజాయతీ చిత్తశుద్ధి ఉన్నట్లుగా తెలుస్తుందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు పేర్కొన్నారు. మోడీ ధరలు పెంపు తగ్గింపు అంతా కూడా మభ్యపెట్టేదిగానే ఉందని ఆయన విమర్శించారు.

పెంచిన ధరలు తగ్గించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ నెల 30న భారీ ధర్నాకు కూడా వామపక్షాలు పిలుపు ఇచ్చాయి. మొత్తానికి ధరలు తగ్గాయి, పండుగ చేసుకోండి అని ఒక వైపు బీజేపీ నేతలు హడావుడి చేస్తూంటే ఇదీ అసలు కధ అని ఎర్రన్నలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయినా జనాలకు తెలియదా ఇది తగ్గింపా లేక వాయింపా అన్నది.