ప్రజలకు నిజాలు తెలియనివ్వకుండా నీడలా కమ్మేస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు. వాస్తవం ఇదీ అని గడప గడపకూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇపుడు చెబుతూ జనాలను చైతన్యం చేయాల్సి వస్తోంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అయితే మీకు అన్నీ మేము చేస్తున్నాం, మేలు మేము చేస్తే పచ్చి అబద్ధాలు చెప్పేవారు కూడా వస్తారు. అన్నీ తెలుసుకుని చైతన్యంతో ఉండడని అని హితబోధ చేస్తున్నారు.
తన సొంత నియోజకవర్గం మాడుగులలో దేవరాపల్లి మండలం వాలాబు గిరిజన ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సందర్శించి కీలకమైన కామెంట్స్ చేశారు. ఏనాడో ఆగిన అభివృద్ధిని గిరిజన పల్లెలకు తీసుకువచ్చింది తమ ప్రభుత్వం అని అన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చామని, అనేక పధకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నామని అన్నారు.
అయినా సరే కొంతమంది ఎవరో వస్తే వారు చెప్పింది విని చప్పట్లు కొడుతున్నారని, అది మంచిదేనా అని ప్రశ్నించారు. మంచి చేసే వారి వెంట ఉంటేనే ఏదైనా చేయగలమని అన్నారు. ఊరికి తారు రోడ్డు వేయడమే కాదు మంచి నీటి సదుపాయం సహా ఎన్నో అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేసింది అని చెప్పుకున్నారు.
ఎన్నికల వేళకు ఓట్ల కోసం ఎందరో వస్తారని వారు ఎన్నో అసత్యాలు చెబుతారని కానీ మంచి ఎవరు చేశారో జనాలు గుర్తుంచుకుంటే మంచిదని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తే హామీలు తీర్చే పాలకులను అండగా నిలిస్తే మరిన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది అని ఆయన అన్నారు. ఇలా గడప గడపకూ తిరిగి వాస్తవాలను వైసీపీ ఎమ్మెల్యేలు బాగానే చేరవేస్తున్నారు.