అసెంబ్లీలో చెల్లి ప్ర‌జెంటేష‌న్‌కు ముగ్ధుడైన జ‌గ‌న్‌!

నా చెల్లి విడ‌ద‌ల ర‌జినీ అంటూ రెండు ద‌ఫాలు అసెంబ్లీలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. హెల్త్ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి, డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు పెట్ట‌డానికి సంబంధించిన బిల్లుపై చ‌ర్చ‌లో…

నా చెల్లి విడ‌ద‌ల ర‌జినీ అంటూ రెండు ద‌ఫాలు అసెంబ్లీలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. హెల్త్ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి, డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు పెట్ట‌డానికి సంబంధించిన బిల్లుపై చ‌ర్చ‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జినీని ఉద్దేశించి త‌న చెల్లిగా అభివ‌ర్ణించారు. హెల్త్ వ‌ర్సిటీకి డాక్ట‌ర్ వైఎస్సార్ పేరు పెట్ట‌డంతో సంబంధిత మంత్రి విడ‌ద‌ల ర‌జినీ కీల‌క పాత్ర పోషించారు.

ముఖ్యంగా అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిరోజూ చేసే ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను ఇవాళ ర‌జినీ ఇవ్వ‌డం విశేషం. అదే సంగ‌తిని జ‌గ‌న్ ప‌రోక్షంగా చెప్పారు. ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబుకు ఏ మాత్రం ప్రేమ‌, గౌర‌వం లేవ‌ని ర‌జినీ చెప్పుకొచ్చారు. ఇందుకు సాక్ష్యంగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు, ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మ‌ధ్య సాగిన ప్రైవేట్ సంభాష‌ణ‌ను అసెంబ్లీలో విడ‌ద‌ల ర‌జినీ స్పీక‌ర్ అనుమ‌తితో ప్ర‌ద‌ర్శింప‌జేశారు. ఆ వీడియోలో చంద్ర‌బాబు, ఆర్కే మ‌ధ్య సంభాష‌ణ ఎలా సాగిందంటే…

రాధాకృష్ణః ఎన్టీఆర్ ఆరోగ్య‌శ్రీయే ఉందా ఇంకా పేరు

చంద్ర‌బాబుః ఎన్టీఆర్ ఆరోగ్య‌శ్రీ నుంచి వాడి పేరు తీసేస్తా. ఎన్టీఆర్ ఆరోగ్య‌శ్రీని మార్చాలి, మారుస్తాం.

రాధాకృష్ణః అదే మొన్న నేను మీకు చెప్పాను క‌దా

చంద్ర‌బాబుః మారుస్తా

రాధాకృష్ణః మారుద్దాం, త‌ర్వాత రీవ్యాంప్ చేద్దాం

చంద్ర‌బాబుః అది వేరే కంబైన్డ్ పెట్టి

రాధాకృష్ణః రీవ్యాంప్ చేసి టోట‌ల్‌గా ప‌బ్లిసిటీ ఇచ్చేద్దాం. ప‌బ్లిసిటీ ఇచ్చేయాలి బాగా…

చంద్ర‌బాబుః మార్చేస్తాం, వేరే పేరు మార్చేస్తాం

రాధాకృష్ణః అదే పేరు మార్చేయాలి. దాన్ని పూర్తిగా మ‌ర్చిపోవాలి.

చంద్ర‌బాబుః అది ఎప్పుడో మ‌ర్చిపోయారు. వాడిది అయిపోయింది. వాడిదిప్పుడు మ‌నం వ‌ర్రీ కావాల్సిన అవ‌స‌రం లేదు.

రాధాకృష్ణః ఆహా, వాడి గురించే

ఆ వీడియోలో ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు “వాడు” అని దూషించ‌డాన్ని ర‌జినీ ప్ర‌త్యేకంగా స‌భ దృష్టికి తెచ్చారు. వాళ్ల మ‌న‌సులో ఎంత దుర్మార్గ‌మైన ఆలోచ‌న‌లున్నాయో చూడాల‌ని కోరారు. ఇక్క‌డ (అసెంబ్లీ) వాళ్లు చేస్తున్న‌దంతా డ్రామా అని మంత్రి విమ‌ర్శించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హ‌క్కు లేదని విడ‌ద‌ల ర‌జినీ స్ప‌ష్టం చేశారు. ఎన్టీఆర్ అంటే త‌మ‌కు చాలా గౌర‌వం వుంద‌ని, టీడీపీ స‌భ్యుల‌కే లేద‌ని ఆమె స‌భ దృష్టికి తీసుకొచ్చారు. 

మొత్తానికి ఎన్టీఆర్‌పై ఎంతో గౌర‌వం, అభిమానంతో హెల్త్ వ‌ర్సిటీకికి ఆయ‌న పేరు తొల‌గించామ‌ని ర‌జినీ చెప్ప‌క‌నే చెప్పారు. అయితే విడ‌ద‌ల రజినీ స‌భ‌లో అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా చెప్పిన తీరుకు జ‌గ‌న్ ముగ్ధుడ‌య్యారు. ఆ కార‌ణం వ‌ల్లే “నా చెల్లి” అంటూ ర‌జినీపై ప్ర‌త్యేక అభిమానాన్ని జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించారు.