కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ.. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తకు ఎలాంటి గుర్తింపు లభిస్తుందో గమనించడానికి తానే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పారు. అలాగే, ఈ ఎన్నికల్లో తన విజయానికి పనిచేసిన ప్రతి ఒక్కరినీ మరచిపోనని, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుంటానని వర్మ అంటున్నారు.
అయితే వర్మ మాటలు పైకి చూడడానికి మాత్రం.. తమ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలకు, నియోజకవర్గపరిధిలోని కూటమి పార్టీల నాయకులకు ఇచ్చిన భరోసాలాగానే కనిపిస్తుంది. వారందరి అవసరాలను కూడా తాను గమనిస్తూ ఉంటానని చెప్పినట్టుగానే అనిపిస్తుంది. కానీ, అదే వ్యాఖ్యలను కాస్త లోతుగా గమనిస్తే గనుక.. చంద్రబాబుకు హెచ్చరికలు కూడా అని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే.. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ శ్రీనివాసవర్మ పేరును ప్రకటించిన తర్వాత కూడా.. ఆయనను పక్కకు తప్పించడానికి చంద్రబాబునాయుడు తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.
నరసాపురం ఎంపీ టికెట్ ను దొడ్డిదారిలో తెచ్చుకోవాలని ఆశపడిన తన ఆత్మీయుడు రఘురామక్రిష్ణరాజు కు ఇప్పించాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే.. భాజపాకు మరో రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తామని బేరాలు పెట్టారు. ఆ రకంగా శ్రీనివాసవర్మ అవకాశాలకు గండికొట్టాలని చూశారు.
బహుశా ఈ బాబు మార్కు రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే కావొచ్చు. కేంద్రమంత్రి వర్మ మాట్లాడుతూ.. ‘నామినేషన్ చివరి రోజు వరకు కూడా తన అభ్యర్థిత్వంపై చాలా ప్రచారాలు జరిగాయని’ వ్యాఖ్యానించడం గమనార్హం. తను అసలు అవకాశమే దక్కకుండా చంద్రబాబునాయుడు చేసిన కుట్ర ప్రయత్నాన్ని బాగానే గుర్తుంచుకుంటానని వర్మ చెబుతున్నట్టుగా ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.