బాబు సర్కారు మళ్లీ కత్తి ఝుళిపించింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల తర్వాత.. కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు అందరినీ బదిలీ చేసి, తమకు అనుకూలురైన కొత్త వారిని నియమించిన చంద్ర సర్కారు.. ఒక్కరోజు కూడా గడవకముందే, ఐపీఎస్ ల మార్పుచేర్పుల మీద దృష్టి పెట్టింది.
చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ పాలనలో ఎట్టి కక్ష సాధింపులూ ఉండబోవని ప్రకటించారు గానీ.. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగానే జరుగుతోంది. మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జగన్ హయాంలో డీజీపీగా ఉంటూ.. తెలుగుదేశం నాయకులకు కొరుకుడు పడకుండా వ్యవహరించిన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిపై తెలుగుదేశం ముందు నుంచి విరుచుకుపడుతోంది. ఆయన మీద అనేక ఆరోపణలు చేసి.. ఎన్నికల ముందు పక్కకు తప్పించేలా చేశారు. ఆయన స్థానంలో ఈసీ నియమించిన డీజీపీని కూడా మార్చి.. చంద్రబాబునాయుడు సర్కారు ద్వారకా తిరుమల రావును తీసుకువచ్చింది. తీరా ఇప్పుడు ఐపీఎస్ ల బదిలీలు చేపట్టారు. జగన్ మనిషిగా ముద్ర ఉన్న మాజీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా అప్రాధాన్య పోస్టుకు పంపారు.
2014-19 సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా పని చేశారనే అభిప్రాయంతో.. ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కారు ముప్పతిప్పలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మధ్యలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నాక ఆయనను జగన్ సర్కారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పదవిలోనే నియమించింది. మళ్లీ సస్పెండ్ చేయగా, ఆయన మళ్లీ కోర్టుకెళ్లి.. ఉత్తర్వులు తెచ్చుకున్నారు. పదవీవిరమణ చేయాల్సిన చివరి రోజున మళ్లీ అదే పోస్టింగు ఆయనకు ఇచ్చారు.
ఏబీవీకి ఎంతో ఆప్తుడైన చంద్రబాబు.. ఆయనకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా.. జగన్ కు దగ్గరివాడైన రాజేంద్రనాధ్ర రెడ్డికి సేమ్ టూ సేమ్.. అదే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పోస్టు కట్టబెట్టారు. దీంతో ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
సీఐడీ విభాగంలోని వివాదాస్పద అధికారి సునీల్ కుమార్ ను బదిలీచేసి జీఏడీ లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఎస్పీగా రిషాంత్ రెడ్డి ని రిలీవ్ చేసి పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. మొత్తానికి నారా లోకేష్ రెడ్ డైరీ తన పనిచేయడం ప్రారంభించినట్లున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.