కేజ్రీకి వస్తే.. కవితక్కకు కూడా వస్తుందా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ కేసులో బెయిలు లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో బెయిలు పొంది.. ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్న ఈ ఆప్ అధినేత, తుది విడత పోలింగు ముగిసిన…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కామ్ కేసులో బెయిలు లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో బెయిలు పొంది.. ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్న ఈ ఆప్ అధినేత, తుది విడత పోలింగు ముగిసిన తర్వాత.. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్లు బెయిలు పొడిగించాలని కోరినప్పటికీ అప్పట్లో ఫలితం దక్కలేదు.

కాగా, మళ్లీ పెట్టుకున్న బెయిలు పిటిషన్ ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు.. గురువారం సాయంత్రం బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఆయనకు ఇచ్చిన బెయిలును 48 గంటలు నిలిపేయాల్సిందిగా, హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా, ఉత్తర్వులివ్వాలని ఈడీ కోరినా కోర్టు పట్టించుకోలేదు. కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో.. ఆప్ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కాగా, ఇదే పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు రావడంతో, భారత రాష్ట్ర సమితికి చెందిన గులాబీ నాయకుల్లో కూడా కనిపించని ఆనందం వెల్లువెత్తుతోంది. ఆయనకే బెయిలు వచ్చిన తర్వాత.. తమ పార్టీ నాయకురాలు కవితకు కూడా బెయిలు తప్పకుండా వస్తుందని వారు ఆశపడుతున్నారు.

లిక్కర్ స్కామ్ కు అసలైన ప్రధాన సూత్రధారిగా కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. ఈడీ ఆమెను అరెస్టు చేసిన తర్వాత సీబీఐ అధికారులు కూడా రంగ ప్రవేశం చేసి జుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు.

అప్పటి నుంచి కల్వకుంట్ల కవిత పలుమార్లు బెయిలుకోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. కొడుకుకు పరీక్షలున్నాయని, ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని రకరకాల కారణాలు చెప్పారు. ఏం ఫలం దక్కలేదు. కాగా కవిత సీబీఐ కస్టడీ శుక్రవారం ముగుస్తుంది. దాంతో ఆమెను మరోసారి రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు. కస్టడీని కోర్టు పొడిగిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కేజ్రీవాల్ కు బెయిలు కూడా వచ్చిన నేపథ్యంలో ఆమె కస్టడీని పొడిగించకపోవచ్చునని కొందరు అనుకుంటున్నారు. కానీ కోర్టు తీర్పు ఆమెకు ప్రతికూలంగా ఉండచ్చుననే అంచనాలు సాగుతున్నాయి.