దైవ సన్నిధానం.. ఆంధ్ర ఎఫెక్ట్!

సినిమా జనాల సంఘం ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ లో నిర్మించిన ఆలయాల సముదాయం దైవ సన్నిధానం. నటుడు జగపతిబాబు తండ్రి, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఈ దైవ సన్నిధానం అభివృద్దికి చాలా వర్క్…

సినిమా జనాల సంఘం ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ లో నిర్మించిన ఆలయాల సముదాయం దైవ సన్నిధానం. నటుడు జగపతిబాబు తండ్రి, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఈ దైవ సన్నిధానం అభివృద్దికి చాలా వర్క్ చేసారు. ఆ తరువాత ఉన్నట్లుండి దీని నిర్వహణను విశాఖ కు చెందిన స్వరూపానంద స్వామీజీ ఆశ్రమానికి అప్పగించారు. అప్పుడే రాష్ట్ర విభజన జరగడం, సదరు స్వామీజీకి అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి అనుబంధం వుండడంతో అలా చేసారన్న వార్తలు వినవచ్చాయి.

అప్పటి నుంచి సినిమా రంగం నుంచి ఎవరో ఒకరు పెద్దగా ఆలయాల వ్యవహారాన్ని చూస్తూ వున్నా, ముఖ్యంగా స్వరూపానంద స్వామీజీదే ఆధిపత్యంగా వుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు స్వరూపానంద పూర్తిగా డిఫెన్స్ లో వున్నారు. ఆంధ్రలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఆడిన ఆట అంతా కట్టయింది. ప్రభుత్వం ఖర్చుతో సెక్యూరిటీ, ప్రభుత్వం ఖర్చుతో పీఠంలో పూజలు వగైరా, ప్రభుత్వం నుంచి భూములు ఇలా చాలా చేసారు. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో దైవ సన్నిధానాన్ని కూడా ఆ పీఠం నుంచి తప్పించే ఆలోచనలు సాగుతున్నాయి. ప్రస్తుతం మురళీ మోహన్ దాని బాధ్య‌తలు చూస్తున్నారు. కానీ సినిమా పెద్దలు కొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని సిఎమ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

ఈ వ్యవహారం మొత్తం గత ప్రభుత్వ హయాంలో జరగడంతో ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆ తరువాత నిర్ణయం తీసుకునేలా చేయాలని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో కూడా రూపాయికే ఎకరాల భూమిని అదే స్వామీజీకి గత ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే.