ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్దుల మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిని టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆప్యాయంగా పలకరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్న పరిస్థితి.
రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరనే మాటే గానీ, ఆ వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటే, అది వార్త అవుతోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అధికార పార్టీ కీలక నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత పరస్పరం పలకరించుకోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు తన పుట్టిన రోజు సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు పొందడానికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడ కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈయన జగన్‌కు మేనమామ. జగన్, చంద్రబాబు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, రవీంద్రనాథ్‌రెడ్డి పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. రవీంద్రనాథ్‌రెడ్డి భుజంపై చంద్రబాబు చేయి వేసి యోగక్షేమాలు ఆరా తీశారు. ఈ దృశ్యాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి. బాబుతో ఎంతో ఆప్యాయంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడ్డం అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్రర్రె ఈయన జగన్‌లా కాదే అని అక్కడున్న వారు అనుకోవడం గమనార్హం. జగన్ మేనమామతో చంద్రబాబు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.