ఏపీ వైద్యానికి జబ్బు చేసింది. అది డబ్బు జబ్బు. మనిషికి ఐదు ఇంద్రియాలుంటాయి. ఆరో ఇంద్రియం డబ్బు అని పెద్దలు చెబుతారు. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేనిది. ముఖ్యంగా వైద్యారోగశాఖలో నిధుల కొరత పట్టి పీడిస్తోంది. చిన్న చిన్న వాటికి కూడా మందులు ఇవ్వలేని దుస్థితి. ప్రభుత్వాస్పత్రులకు మందులు, ఆపరేషన్, ఇతరత్రా పరికరాలు అంజేస్తున్న వాళ్లకు సమయానికి డబ్బు చెల్లించలేని పరిస్థితి. దీంతో వాటిని సరఫరా చేయడం మానేశారు. ప్రధానంగా ప్రభుత్వ ఆస్పత్రులకు పేదలే వస్తుంటారు.
నిధుల కొరతతో రోగులకు మందులు పంపిణీ చేయకపోవడం, అలాగే ఆపరేషన్లు చేయకపోవడం తదితర అంశాలు జగన్ ప్రభుత్వంపై బాగా ప్రభావం చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా వేసవి ప్రారంభంలోనే కరెంట్ కోతలు మొదలు కావడం, ఆస్పత్రుల్లో జనరేటర్లు నడపడానికి డీజిల్ కొరత తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రతికూల పరిస్థితులున్న వైద్యారోగ్యశాఖకు పట్టిన జబ్బును నయం చేయడం కొత్త వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీకి సవాల్‌గా మారింది.
వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తన జిల్లా గుంటూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. చివరికి అత్యవసర విభాగంలో కూడా మందులు లేకపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఆస్పత్రిలో 32 విభాగాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క విభాగంలో కూడా తగిన మందులు లేవనే విషయాన్ని తెలుసుకుని ఆమె అవాక్కయ్యారు. ఇంత కాలం ఎమ్మెల్యేగా కేవలం నియోజకవర్గ పరిధిలోని సమస్యల గురించి మాత్రమే రజినీకి తెలుసు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకున్న దయనీయ పరిస్థితులు ఒక్క విజిట్‌తోనే రజినీకి తెలిసొచ్చాయి. చేదు నిజాలను జీర్ణించుకోవడం ఆమె అలవాటు చేసుకోవాలి.
ఎందుకంటే కరెంట్ కోతతో ఇటీవల సీఎం సొంత జిల్లా కడప రిమ్స్‌లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారనే ప్రచారం జరిగింది. అలాగే తిరుపతిలో ప్రతిష్టాత్మక మెటర్నటీ ఆస్పత్రిలో కరెంట్ కోత, మరోవైపు అనారోగ్య ఇబ్బందులకు తాళలేక రోగులు రోడ్డెక్కారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతతో ఆస్పత్రుల్లో సెల్ లైటింగ్‌లో, అలాగే టార్చ్‌లైట్లు, కొవ్వొత్తుల వెలుగుల్లో వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్న వైనాన్ని మీడియా కళ్లకు కట్టింది. కావున విడదల రజినీ అత్యవసరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని జనరేటర్లకు డీజిల్ సౌకర్యాన్ని కల్పించాల్సి వుంది. ముందు ఈ పని చేస్తే, కనీసం అంధకారంలో గడిపే అవకాశం రాదు.
మందుల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డబ్బు చెల్లించలేదనే వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఒక్కసారి మందులు సరఫరా చేసిన కాంట్రాక్టర్, మరోసారి ప్రభుత్వ ఆస్పత్రి అంటే జడుసుకునే పరిస్థితి. ఎవరైనా ఎంత కాలమని ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు? కనీసం పేద రోగులకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులనైనా పట్టించుకోక పోవడం క్షమించరాని నేరం. ఏది ఏమైనా ప్రభుత్వ ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలకు వెళ్లాలని విడదల రజినీ నిర్ణయించుకోవడం సంతోషకరం. వెళ్లేటప్పుడు కాస్త గుండె నిబ్బరాన్ని, రోగులు చెప్పే చేదు నిజాలు విని తట్టుకోగలిగే స్థైర్యాన్ని వెంట తీసుకెళ్లడం మంచిది.
ఎందుకంటే స్వయాన తన తల్లికే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన చికిత్స దొరకలేదని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మంత్రి దృష్టికి తెచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పరిస్థితే ఇలా వుంటే, ఇక సామాన్యులకు ఏ విధంగా వైద్యం అందుతుందో రజినీ అర్థం చేసుకోలేదని అనుకోలేం. ప్రభుత్వ ఆస్పత్రులకు చేసిన జబ్బుకు ట్రీట్‌మెంట్ ఇవ్వడం డాక్టర్ కాని యువ మంత్రికి సవాలే. ఇదే సందర్భంలో తనను తాను మంచి అడ్మినిస్ట్రేటర్‌గా నిరూపించుకునేందుకు రజినీకి మంచి అవకాశం కూడా.