చంద్రబాబు గారు! మీకు ఈ పాట అంకితం

చంద్రబాబు గారు! మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇండియా టైం ప్రకారం మీ పుట్టినరోజు అయిపోయినా కూడా అమెరికా లెక్కల్లో ఇంకా ఉంది. కనుక మీకు అమెరికా సమయాన్ని అనుసరించి జన్మదిన శుభాకాంక్షలు.  Advertisement…

చంద్రబాబు గారు! మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇండియా టైం ప్రకారం మీ పుట్టినరోజు అయిపోయినా కూడా అమెరికా లెక్కల్లో ఇంకా ఉంది. కనుక మీకు అమెరికా సమయాన్ని అనుసరించి జన్మదిన శుభాకాంక్షలు. 

మీది రాజకీయంగా సుదీర్ఘ ప్రస్థానం. నేటి పదేళ్ల పిల్లవాడినుంచి యాభై ఏళ్ల వ్యక్తి వరకు..మిమ్మల్ని రాజకీయనాయకుడిగా చూస్తూ పెరిగిన వారే. మీకు అందరూ తెలియరు. కానీ అందరికీ మీరు తెలుసు. మీ రాజకీయం తెలుసు. 

మీ జన్మదినాన్ని పురస్కరించుకుని మీ వయసు పట్ల గౌరవంతో కొన్ని విషయాలు ప్రస్తావించదలచాను. ఇది మీ గురించి నా అంతరంగ ఆవిష్కరణ. 

72 ఏళ్ల వయసులో ఇంకా శారీరక క్రమశిక్షణతో ఉంటూ, దీక్షగా రాజకీయం నెరపుతున్న మీరు పక్కనపెట్టాల్సినవి, చేతపట్టాల్సినవి కొన్నున్నాయి. 

పరీక్షకు తయారయ్యే విద్యార్థులు రెండు రకాలు. 

1. కష్టపడే వాళ్లు, 

2. సులువు పద్ధతులు ఆలోచించేవాళ్లు. 

మొదటి రకం విద్యార్థి తన శ్రమని, పట్టుదలని నమ్ముకుని టైం టేబుల్ వేసుకుని చదువుతాడు. నిద్రలేని రాత్రులు గడుపుతాడు. చదివినవే మననం చేసుకుంటాడు. ఎవరి మీదా ఆధారపడడు. 

రెండవ రకం విద్యార్థి మాత్రం ఇంపార్టెంట్ ప్రశ్నల మీద దృష్టి పెట్టడం, ప్రశ్నాపత్రం ఎక్కడ తయారవుతుందో తెలుసుకోవడం, అది లీకయ్యే మార్గాలు అన్వేషించడం, టీచర్స్ ని ఇంప్రెస్ చేసి కొన్ని ప్రశ్నలు లాగడం, ఇన్విజిలేటర్ని మేనేజ్ చేయడం, కాపీ కొట్టడానికి ముందు సీట్లో ఉన్నవాడినో, పక్క సీట్లో వాడినో మచ్చిక చేసుకోవడం…లాంటి పనుల మీదే దృష్టి పెడతాడు. 

ఎలాంటి మార్గంలో వెళ్లినా రాసే పేపరొకటే. జయాపజయాలు వచ్చేది మార్కుల్ని బట్టే. 

ఇక్కడ మొదటి వాడు విజయం సాధించొచ్చు లేదా అప్పుడప్పుడు కాస్త వెనకబడచ్చు. కానీ పోరాటయోధుడవుతాడు. 

రెండో రకం వాడు గెలవచ్చు. కానీ పరాధీనుడవుతాడు. 

మీ రాజకీయ ప్రస్థానం మొత్తం సులువు మార్గాల్లోనే నడిచింది. మీకన్నీ ప్రకృతి అలా కుదిర్చి పెట్టింది. ఒక రకంగా మీ రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి. మీకు అనువుగా ఉండే భార్యవైపు కుటుంబ సభ్యులు, మీ ఆధిపత్యాన్ని కాదనలేని వారి బంధుప్రీతి అన్నీ అలా కలిసొచ్చాయి. 

ఇంతకు మించి అందరూ ప్రస్తావించే ఊకదంపుడు విషయాలు ఇక్కడ ప్రస్తావించను. మీ జన్మదినం కనుక..అనవసరపు వివాదాలు గుర్తుచేసి మిమ్మల్ని నొప్పించను. 

ఇక పైన చెప్పుకున్న రెండవ రకం విద్యార్థికి ముందు సీటు విద్యార్థి కలిసొచ్చినట్టు, మీకు ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక బలమైన పార్టీ చేయందించింది. 

కానీ అన్నిసార్లూ ఆ పద్ధతి కలిసిరాదు. ఎప్పుడూ ఏదో ఒకటి సాధ్యపడి గట్టెక్కినా ఒక్కోసారి అన్ని దారులూ మూసుకుపోవచ్చు. 

అనుకున్న ప్రశ్నలు పేపర్లో రాకపోవచ్చు, ముందు సీటు వాడు మొహం చాటేయొచ్చు, పక్క సీటు వాడు దద్దమ్మ కావొచ్చు…అప్పుడు అంతా అగమ్యగోచరమే. తెల్లమొహమేసి తెల్లకాగితం అప్పగించి ఫెయిలవ్వాలి తప్ప మరో దారుండదు. 

అప్పుడు అనిపిస్తుంది. ఎవరి మీదా అధారపడకుండా కష్టపడి చదివితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని. 

సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఒక పద్ధతిలో నడిపారు. ఇప్పుడు కాస్త మార్చి చూడండి. ఫలితాలు మీకే తెలుస్తాయి. ఏ ఇతర పార్టీతోనూ పొత్తు గురించి ఆలోచించకండి. ఆలోచించినా శుద్ధ దండగ. ఎందుకంటే బలమైన పార్టీ మొహం చాటేసింది. పక్కనున్న పార్టీ పనికొచ్చేలా కనపడట్లేదు. 

కళ్లు మూసుకుని మీ ఇష్టదైవమైన తిరుమలేశుడిని తలచుకుని ఒంటరి పోరాటం చేయండి. గడప గడప తొక్కండి. మీ గతం చెప్పకండి. అది అనవసరం. భవిష్యత్తు మాట్లాడండి. 

ఎంపీ రఘురామరాజుని, ఆయన వియ్యంకుడు కేవీపీని, ఆయన మిత్రుడు ఉండవల్లిని, జనసేనానిని, మాజీ ఐ.ఏ.యస్ అధికారుల్ని, మాధ్యమాల యజమానుల్ని ..ఇలా ఎవ్వర్నీ నమ్మకండి.

ఎవరి మీదా విమర్శ చేయకుండా, ఎవరి మీదా ఆధారపడకుండా మొదటి రకం విద్యార్థి లాగ కష్టాన్ని, దైవాన్ని నమ్ముకుని జనంలోకి వెళ్లండి. మీ వయసులో మీరు పడే శ్రమ చూసి ఎందరో తటస్థుల మనసులు కదులుతాయి. మిమ్మల్ని పలు కారణాలతో ద్వేషించిన వాళ్లు కూడా మీ కష్టాన్ని చూసి మనసులోనే మోకరిల్లొచ్చు. 

అలా చేస్తే మళ్లీ పదవొస్తుందా అని మాత్రం అడగొద్దు. పైన చెప్పినట్టు ఈ పద్ధతిలో నడిచి ఓడినా పర్వాలేదు. పోరాటయోధుడన్న కీర్తి దక్కుతుంది. మనిషి శాశ్వతం కాదు. నిలబడేది కీర్తి ఒక్కటే. కనుక మీరు పద్ధతి మార్చి కష్టం వైపు అడుగులు వేస్తే రాజ్యలక్ష్మి సంగతేమైనా కానీ యశోలక్ష్మి మాత్రం కచ్చితంగా వచ్చి తీరుతుంది. 

రాజకీయంగా నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా మీరు మా అందరి జీవితంలోనూ భాగం. మీరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. 

అన్నట్టు ఈ జన్మదినానికి మీకు అంకితం చేయాలనుకున్న పాట – “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా…”.

వెంకట్ ఆరికట్ల