ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇవాళ మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మంచివాడంటూనే, ఆయన చుట్టూ వున్న సలహాదారుల వల్లే సమస్య ఎదురవుతోందని ఘాటు ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో తన ఇంట్లో మీడియాతో ఆమె మాట్లాడుతూ పలు సంచలన ఆరోపణలు చేశారు.
అయితే సీఎం జగన్‌పై మాత్రం ఇంకా అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. సీఎం జగన్మోహన్రెడ్డికి చెవులే వుంటాయన్నారు. జగన్ హృదయం మంచిదన్నారు. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి వుంటారని శ్రీదేవి ప్రశంసించారు.
జగన్ అంటే తమకు చాలా అభిమానం అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే హైదరాబాద్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న తనను తీసుకెళ్లి ఎమ్మెల్యే చేశారనే కృతజ్ఞతను వ్యక్తం చేశారు. అలాగే కరోనా సమయంలో ఆస్పత్రిలో తాను చేరినప్పుడు వైఎస్ జగన్ చాలా బాగా ఫాలోఅప్ చేశారని అన్నారు.
ముఖ్యమంత్రికి ఇప్పటికీ గౌరవం ఇస్తానన్నారు. అయితే పక్కన వాళ్లు ఏది చెబితే అది జగన్ వింటారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మంచోడు..చుట్టూ ఉన్నోళ్లే చెడగొడుతున్నారని శ్రీదేవి ఆరోపించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అలాగే ఐ -ప్యాక్ టీమ్ నివేదికలన్నీ డబ్బులిచ్చి రాయించుకుంటున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇది ఓ గ్యాంబ్లింగ్ అనే విషయం మీకు తెలుసా? అని మీడియా ప్రతినిధులను శ్రీదేవి ప్రశ్నించారు. రహస్య ఓటింగ్ జరిగినప్పుడు టీడీపీ అభ్యర్థికి తాను ఓటు వేసినట్టు ఎలా నిర్ధారిస్తారని ఆమె ప్రశ్నించారు.