ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటుకు నోటు ఆశ చూపారనే ప్రచారం నిజమే అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాటలు తేల్చి చెబుతున్నాయి. జనసేన నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాపాక…మొదటి నుంచి వైఎస్ జగన్ సర్కార్కు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాపాక వైసీపీ అభ్యర్థికి అండగా నిలిచారు.
ఇదిలా వుండగా తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు టీడీపీ ఇచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే రాపాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆఫర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటి బేరం తనకే వచ్చిందని సంచలన ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో రాపాక శనివారం మాట్లాడిన సంచలన విషయాలు ఇవాళ వెలుగులోకి వచ్చాయి.
తన ఓటు కోసం మిత్రుడైన టీడీపీ నాయకుడు కేఎస్ఎన్ రాజును ఆ పార్టీ నేతలు పంపారన్నారు. సిగ్గుశరం వదిలేస్తే రూ.10 కోట్లు వచ్చేవని అన్నారు. అయితే తన వద్ద డబ్బు ఉండి వద్దనలేదని రాపాక అన్నారు. ఒకసారి పరువు పోతే సమాజంలో వుండలేమన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా కేఎస్ఎన్ రాజు టీడీపీకి ఓటు వేయాలని కోరారన్నారు.
టీడీపీలో చేరితే మంచి పొజిషన్ ఇస్తామన్నారని చెప్పుకొచ్చారు. జగన్ను నమ్మాను కాబట్టి టీడీపీ ఆఫర్ను తిరస్కరించి నట్టు రాపాక వరప్రసాద్ తెలిపారు. రాపాక తాజా ఆరోపణలతో ఓటుకు నోటు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యేలను మీరు కొన్నారంటే, లేదు మీరే కొన్నారని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. రాపాక తాజా ఆరోపణలపై టీడీపీ ఎలాంటి సమాధానం ఇస్తుందోననే ఉత్కంఠకు తెరలేచింది.