మోడీ బాబు మధ్యలో అరకు కాఫీ

హఠాత్తుగా అరకు కాఫీ ఫ్యామస్ అయిపోయింది. దేశ ప్రధాని అరకు కాఫీ గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో చాలా సేపు చెప్పారు. అరకు కాఫీ అంతర్జాతీయం అయిందని అన్నారు. అరకు కాఫీ ఘుమఘుమలకు…

హఠాత్తుగా అరకు కాఫీ ఫ్యామస్ అయిపోయింది. దేశ ప్రధాని అరకు కాఫీ గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో చాలా సేపు చెప్పారు. అరకు కాఫీ అంతర్జాతీయం అయిందని అన్నారు. అరకు కాఫీ ఘుమఘుమలకు సరిసాటి లేదని మోడీ అంటున్నారు.

తాను అరకు కాఫీ మధురిమలను చవిచూశానని మోడీ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలసి అరకు కాఫీని తాగాను అని గతాన్ని నెమరేసుకున్నారు. 2023 సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో అతిథి దేశాలకు అరకు కాఫీ రుచి చూపించామని చెప్పారు.

మన్ కీ బాత్ లో దేశంలో ముఖ్య ప్రాంతాలు వాటి విశిష్టత గురించి చెప్పడం మోడీకి అలవాటు. ఈసారి అరకు వైపుకు మన్ కీ బాత్ మళ్ళింది. మూడోసారి ప్రధాని అయ్యారు మోడీ. ఆ తరువాత తొలిసారి ఆకాశవాణి ద్వారా తన మన్ కీ బాత్ మళ్లీ కొనసాగించారు.

అందులో అగ్ర తాంబూలం ఆంధ్రాకు అరకుకు ఇచ్చారు. ఈ మధ్యలో చంద్రబాబు ప్రస్తావన కూడా తెచ్చారు. అయితే దీని మీద ఆసక్తికరమైన  చర్చ కూడా సాగుతోంది. మోడీ యధాలాపంగా అరకు కాఫీతో పాటు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారా లేక అందులో కూడా ఏమైనా కారణాలు ఉన్నాయా అని అలోచిస్తున్న వారూ ఉన్నారు.

ఏపీలో టీడీపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా పేరుతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కిరికిరి మొదలెట్టారు. దాంతో చంద్రబాబు నమ్మకమైన నేస్తం గా కనిపిస్తున్నారు. దాంతో తన ప్రియమిత్రుడుగా మోడీకి బాబు ఇంకా బాగా కనిపిస్తున్నారు అని అంటున్నారు.

మోడీ బాబు అయిదేళ్ల ఎడబాటు తరువాత ఈ ఎన్నికల ముందే కలిశారు. దాని రాజకీయ లాభాలను ఇద్దరూ అందుకున్నారు. ఇపుడు అరకు కాఫీ సాక్షిగా ఆ మధురిమలను మోడీ తన మనసులోని మాటగా జాతి జనులకు వినిపించారనుకోవాలి. ఈ స్నేహం గతంలో మాదిరిగా నాలుగేళ్ళకే కటీఫ్ కాకుండా గట్టిగా ఉండాలని కూడా బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారేమో.