ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బోలెడంత మంది నాయకులున్నారు. కానీ ఏ ఎన్నిక జరిగినా కనీసం డిపాజిట్ దక్కించుకునే పరిస్థితి లేదు. ఏపీలో బీజేపీ బలోపేతం కాకపోవడంపై అధిష్టానం అసహనంగా ఉన్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో అధికారంలో ఉంటున్న పార్టీని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న వాళ్లే తప్ప, బలోపేతం చేసే వాళ్లే కరువయ్యారనే చర్చకు తెరలేచింది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికైనా, బద్వేలు, తాజాగా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కనీస పోటీ కూడా బీజేపీ ఇవ్వకపోవడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది.
ఆత్మకూరు ఉప ఎన్నికలో 1,37,289 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీజేపీ దక్కించుకున్న ఓట్లు 19,353. ప్రధాన ప్రతిపక్షాలు పోటీలో లేకపోయినా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం ఏంటనే నిలదీత బీజేపీ అధిష్టానం నుంచి వచ్చినట్టు సమాచారం.
ఏపీ బీజేపీ నేతలెవరో ఒకసారి చూద్దాం. జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, సుజనాచౌదరి, సీఎం రమేష్‌నాయుడు, టీజీ వెంకటేష్, పురందేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, లంకా దినకర్, నాగభూషణం చౌదరి, రమేష్‌నాయుడు, భానుప్రకాష్‌రెడ్డి ఇలా చాలా మంది ఖద్దర్ చొక్కా లీడర్లు నిత్యం టీవీల్లో కనిపిస్తుంటారు.
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో వీళ్లలో ఎంత మంది పాల్గొన్నారని ప్రశ్నిస్తే… వేళ్ల పై లెక్క పెట్టేంత మంది నాయకులు కూడా లేకపోవడం గమనార్హం. పదవులు, ఆదాయం కోసమైతే అందరూ వెంపర్లాడే వాళ్లే. ఇదే పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో తిరగాలని ఆదేశిస్తే మాత్రం తమను కాదని ఎంచుకోవాలని అందరూ చెబుతారనే విమర్శ బీజేపీలో ఉంది.
బీజేపీ నేతలు ఇటు టీడీపీ, అటు వైసీపీ కోవర్టులుగా మారి పబ్బం గడుపుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఏపీలో నాయకులు బీజేపీకి భారంగా మారారనే చర్చ జరుగుతోంది. ఇలాగైతే భవిష్యత్‌లో బీజేపీ ఏ విధంగా బలపడుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పే నేతలెవరూ బీజేపీలో లేకపోవడం గమనార్హం.