పవన్ కల్యాణ్ ను మక్కికిమక్కి దింపేశాడుగా!

ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ ఫాలో అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. వీళ్లలో నితిన్ గురించి అందరికీ తెలిసిందే. గట్టిగా పవన్ ను ఫాలో అవుతాడు. అది తనకు పవన్ పై ఉన్న ప్రేమ అంటాడు.…

ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్ ఫాలో అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. వీళ్లలో నితిన్ గురించి అందరికీ తెలిసిందే. గట్టిగా పవన్ ను ఫాలో అవుతాడు. అది తనకు పవన్ పై ఉన్న ప్రేమ అంటాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరో చేరిపోయాడు. అతడే వైష్ణవ్ తేజ్.

ఈరోజు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా నుంచి టీజర్ రిలీజైంది. టీజర్ అంతా ఒకెత్తయితే, చివర్లో వైష్ణవ్ తేజ్ హావభావాలు మరో ఎత్తు. ఆ లాస్ట్ క్లిప్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చంతా. అచ్చు గుద్దినట్టు పవన్ మేనరిజమ్స్ ను వైష్ణవ్ అనుకరించాడు.

పవన్ నటించిన ఖుషి సినిమా ఇగోల మీద నడుస్తుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమా కూడా ఇగోల మీద నడుస్తుందనే విషయం టీజర్ తో అర్థమైంది. హీరోయిన్ అంటే హీరోకు ఇష్టం. కానీ ఆమెతో మాట్లాడ్డానికి ఇగో. ఈ లైన్ మీద టీజర్ కట్ చేశారు. లాస్ట్ ఫ్రేమ్ లో వైష్ణవ్ తేజ్ తో పవన్ ఖుషీ మేనరిజమ్స్ ను రిపీట్ చేయించాడు దర్శకుడు.

గిరీశాయ డైరక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ పెయిర్ బాగుంది. కేవలం హీరోహీరోయిన్ల వరకే పరిమితం కాకుండా, సుబ్బరాజు, అలీ లాంటి సీనియర్ నటుల పాత్రల్ని కూడా టీజర్ లో పరిచయం చేశారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 పాటలు హిట్టయ్యాయి. ఇప్పుడు టీజర్ తో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. అయితే సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే జులై 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.