దివంగత వైఎస్సార్ విగ్రహం దగ్గరి నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ సినిమా ప్రమోషన్ ప్రారంభించారు. కొండా సురేఖ, మురళి దంపతుల జీవిత చరిత్ర ఆధారంగా 'కొండా' సినిమా ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇవాళ కొండా సురేఖ విజయవాడ వచ్చారు.
విజయవాడలోని కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సినిమా ప్రమోషన్‌ను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ఏపీలో సినిమా ప్రమోషన్ టూర్ ప్రారంభించామన్నారు.
సినిమా ప్రమోషన్ కోసం ఏపీ అంతా తిరుగుతామన్నారు. వైఎస్సార్ భిక్ష వల్ల తాము ఇలా ఉన్నామన్నారు. వైఎస్సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని సురేఖ చెప్పుకొచ్చారు. ఎప్పటికీ వైఎస్సార్ అభిమానిగా ఉంటానన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆయనతో తప్ప మరెవరితోనూ ఆత్మీయత, అనుబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల డబ్బు రాజకీయమే నడుస్తోందని విమర్శించారు.
రాజకీయాలకు అతీతంగా తాను సినిమా గురించే మాట్లాడుతున్నట్టు సురేఖ తెలిపారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రాతి నిథ్యం వహిస్తున్నట్టు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు.
తమ లవ్ స్టోరీ, నక్సల్స్ జీవితం, రాజకీయ జీవితంపై కొండ సినిమా ఉంటుందన్నారు. ఆ రోజు ఉన్న నక్సల్స్ ఉండి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చేవారు కాదని సురేఖ తెలిపారు.