జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు…కానీ!

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. కాపుల అభ్యున్న‌తి కోసం ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అవిశ్రాంత పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో చంద్ర‌బాబు కాపుల‌కు…

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. కాపుల అభ్యున్న‌తి కోసం ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అవిశ్రాంత పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో చంద్ర‌బాబు కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని ఆశ చూపి, చివ‌రికి చేతులెత్తేసి మోస‌గించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో హామీని నిల‌బెట్టుకోవాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్య‌మించారు.

ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ అమానుషంగా వ్య‌వ‌హ‌రించింది. మాట‌ల్లో చెప్ప‌లేని, రాయ‌లేని భాష‌లో త‌మ కుటుంబ స‌భ్యుల్ని బాబు స‌ర్కార్ బూతులు మాట్లాడి తీవ్రంగా అవ‌మానించిన‌ట్టు ప‌ద్మ‌నాభం అనేక మార్లు ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు అంశం రాష్ట్రాల ఇష్ట‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం అత్యున్న‌త చ‌ట్ట స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీన్ని ప్రాతిప‌దిక‌గా చేసుకుని సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం బ‌హిరంగ లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. అయితే సీఎంను ఇబ్బంది పెట్టే ఉద్దేశం త‌న‌కు లేద‌ని ఆయ‌న పేర్కొన‌డం విశేషం.

తాజాగా ఈ లేఖ రాయడానికి గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈడబ్ల్యూఎస్ పై ఇచ్చిన తీర్పు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు రాజ్య‌స‌భ‌లో మంత్రి ఇచ్చిన స‌మాధానం అనుసరించి ఆర్టికల్ 342 A (3) ప్రకారం రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చ‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి మ‌రోసారి వారి ఆద‌ర‌ణ‌తో అధికారంలోకి వ‌చ్చేందుకు చూడాల‌ని కోరారు.  

అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని జ‌గ‌న్‌ను ఆయ‌న కోరారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపున‌కు కృషి చేశారని లేఖలో ప్ర‌స్తావించారు. మిగతా కులాలు వారి లాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని విన్న‌వించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ప్రజలు దేవుళ్ల‌లా భావించార‌ని పేర్కొన్నారు.

పేద వర్గాలకు మంచి చేసి వారి ప్రేమ‌కు మీరు పునాదులు వేసుకోవాలని సీఎంను కోరారు. రిజర్వేషన్లు కల్పించేందుకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలని సూచించారు. నా జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు  ప‌ద్మ‌నాభం స్ప‌ష్టం చేయ‌డం విశేషం.