ఏపీలో కాపు కాక‌…వైసీపీ కీల‌క నిర్ణ‌యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో “కాపు” కాక రేపుతోంది. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల ముంగిట కాపుల మ‌న‌సు చూర‌గొనేందుకు అన్ని పార్టీలు త‌మ ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశాయి. ఏపీలో కాపులు ఓటు బ్యాంక్ బ‌లంగా వుంది. దీంతో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో “కాపు” కాక రేపుతోంది. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల ముంగిట కాపుల మ‌న‌సు చూర‌గొనేందుకు అన్ని పార్టీలు త‌మ ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశాయి. ఏపీలో కాపులు ఓటు బ్యాంక్ బ‌లంగా వుంది. దీంతో వారి మ‌ద్ద‌తు అధికారాన్ని ద‌క్క‌డంలో కీల‌క‌పాత్ర పోషించ‌నుంది. ఈ నేప‌థ్యంలో కాపులు ఆరాధ్య దైవంగా భావించే వంగ‌వీటి రంగా వ‌ర్ధంతి స‌భ‌ను ఇవాళ అన్ని పార్టీలు పోటాపోటీగా నిర్వ‌హిస్తున్నాయి.

విశాఖ‌లో  రాధా – రంగా అసోసియేషన్ పేరుతో సోమ‌వారం కాపు నాడు సమావేశం నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. ఈ స‌భ‌కు ఏపీ అధికార పార్టీ హాజ‌రు కాకూడ‌ద‌నే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు వైసీపీ పెద్ద‌ల నుంచి ఆ సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌కు స‌మాచారం వెళ్లింది. ఈ స‌మావేశం వెనుక మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో పాటు జ‌న‌సేన నాయ‌కులు కీల‌కంగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతో ఆ స‌మావేశానికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌ని వైసీపీ పెద్ద‌లు భావించారు. స‌మావేశానికి పార్టీల‌కు అతీతంగా కాపు నేత‌లంద‌రినీ ఆహ్వానించిన‌ట్టు నిర్వాహ‌కులు చెబుతున్నారు. అయితే వారు ప‌క్కాగా జ‌న‌సేనాని ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేస్తున్నార‌నే సంకేతాలున్నాయి. దీంతో స‌మావేశానికి వెళ్లి అభాసుపాలు కావ‌డం కంటే, వెళ్ల‌కుండా వుండ‌డ‌మే మంచిద‌నే అభిప్రాయానికి వైసీపీ నేత‌లు వ‌చ్చిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

విశాఖ‌లోని ఏఎస్ రాజా గ్రౌండ్స్‌లో ఇవాళ స‌భ జ‌ర‌గ‌నుంది. 2024లో కాపు సామాజిక వ‌ర్గం రాజ్యాధికారాన్ని ద‌క్కించుకోవ‌డంపై కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఎంత వ‌ర‌కూ కార్యాచ‌ర‌ణ‌కు నోచుకుంటుందో వేచి చూసే ధోర‌ణిలో ఉండ‌డమే మంచిద‌ని అధికార పార్టీ గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలా వుండ‌గా స‌మావేశానికి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నేత‌లు హాజ‌ర‌వుతార‌ని చెబుతున్నారు. ఈ స‌భ నిర్ణ‌యాల‌పై ఉత్కంఠ నెల‌కుంది.