వార్ అండ్ ల‌వ్ -ఝాన్సీ క‌థ‌లు

ఝాన్సీ రాసిన దేవుడ‌మ్మ క‌థ‌ల సంపుటి చ‌దివి చాలాసేపు నిశ‌బ్దంగా వుండిపోయాను. మంచి క‌థ‌ల ల‌క్ష‌ణ‌మిది. దేవుడమ్మ‌లో మా పెద్ద‌మ్మ క‌నిపించింది. ఆమె క‌ష్ట‌జీవి. మా పెద్ద‌నాయిన సోమ‌రి. దోవ‌న పోయే వాళ్లంద‌ర్నీ ఇంటికి…

ఝాన్సీ రాసిన దేవుడ‌మ్మ క‌థ‌ల సంపుటి చ‌దివి చాలాసేపు నిశ‌బ్దంగా వుండిపోయాను. మంచి క‌థ‌ల ల‌క్ష‌ణ‌మిది. దేవుడమ్మ‌లో మా పెద్ద‌మ్మ క‌నిపించింది. ఆమె క‌ష్ట‌జీవి. మా పెద్ద‌నాయిన సోమ‌రి. దోవ‌న పోయే వాళ్లంద‌ర్నీ ఇంటికి పిలిచి, పెద్ద‌మ్మ‌తో కాఫీ, టీలు పెట్టించి, పొద్దుపోని మాట‌లు మాట్టాడేవాడు. పెద్ద‌మ్మ నాలుగుకి లేచి ఎనుముల్ని చూసుకుని, పాలు పిండి, పిల్ల‌ల్ని సాకి, పొలం ప‌నులు చూసి, క‌ట్టెల పొయ్యి ముంద‌ర పొగ‌చూరి పోయేది.

ఒక‌రోజు రానే వ‌చ్చింది. “ఏమే పుల్ల‌న్న గారి సుబ్బ‌న్న వ‌చ్చాడు. కాఫీ తీసుకురా” అని పెద్ద‌నాయిన ఆర్డ‌రేసాడు. కాఫీకి బ‌దులు చెల‌కోలా తీసుకొచ్చింది. స‌ర్‌స‌ర్‌మ‌ని సుబ్బ‌న్న‌కి రెండు, పెద్ద‌నాయిన‌కి నాలుగు వాత‌లు తేలాయి. తుర‌కంలో తిడుతూ వెంట‌ప‌డే స‌రికి ఇద్ద‌రూ పారిపోయారు. పెద్ద‌మ్మ‌కి తుర‌క దెయ్యం ప‌ట్టింద‌ని నిర్ధారించారు. ఊరంతా వ‌ణికింది. క‌సాపురం ఆంజ‌నేయ‌స్వామి దగ్గ‌రికి తీసుకెళ్దామంటే ప‌ట్టింది హిందూ దెయ్యం కాదు (దెయ్యాల‌కి మ‌తం లేక‌పోవ‌డం గొప్ప విష‌యం). ద‌ర్గాకి తీసుకెళ్లాల‌ని క‌ట్టి లాక్కెళ్లే ప్ర‌య‌త్నం చేసారు. ఆవిడ దుర్గ‌గా మారి ర‌జ‌నీకాంత్ విల‌న్ల‌ని గాల్లోకి లేపిన‌ట్టు లేపింది. ఎనుము త‌ప్పి పోతే ప‌ది ఊళ్లు కాలిన‌డ‌క‌న తిరిగిన మ‌నిషికి ఎంత శ‌క్తి వుంటుంది?

పెద్ద నాయిన కుదురుగా మారే స‌రికి, దెయ్యం కూడా బుద్ధిగా వెళ్లిపోయింది. ఆమె బ‌తికి వుండ‌గా దెయ్యం రాలేదు. చ‌చ్చి ఆమె కూడా దెయ్యం కాలేదు. యుద్ధ రంగాల్లో మ‌గ వాళ్లు చేసిన పోరాటాల కంటే ఉనికి కోసం జీవిక కోసం ఇళ్ల‌లోని ఆడ‌వాళ్లు చేసిన యుద్ధాలే గొప్ప‌వి. వీరోచిత‌మైన‌వి. ఝాన్సీ క‌థ‌ల్లో ఈ నిశ్శ‌బ్ద యుద్ధాలే క‌నిపిస్తాయి. ఆమె ఎక్క‌డా ఆవేశ ప‌డ‌కుండా, సున్నితంగా మార్మికంగా క‌థ చెబుతారు.

నీటిలో చేప‌లాంటి వ్య‌క్తి, ఎడారి లాంటి న‌గ‌రానికి వ‌స్తే ఏం జ‌రుగుతుందో నీరుగ‌ట్టోడు క‌థ చెబుతుంది. యుద్ధంలో ప్రేమ వెతికే క‌థ ఏక‌ప‌ర్ణిక.

మాత‌మ్మ ప్ర‌శ్న‌కి జ‌వాబు లేదు. మ‌హారాణుల శీలం కోసం యుద్ధాలు జ‌రిగాయి కానీ, మాత‌మ్మ‌ల కోసం క‌త్తి కాదు క‌దా, గ‌డ్డి పోచ తీసుకున్న వాళ్లు కూడా లేరు. బానిస‌ల హ‌క్కుల కోసం అమెరికాలో పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. ఊరికి దూరంగా పెట్టి, మ‌ల‌మూత్రాలు మోయించిన దుర్మార్గంపై మ‌న దేశంలో ఎవ‌రైనా తిర‌గ‌బ‌డ్డారా? ద‌ళితుల మాన‌వ హ‌క్కుల కోసం క‌నీసం రాజు కాదు క‌దా, ఒక పాలెగాడైనా యుద్ధం చేసాడా? మ‌న నీతి శాస్త్రాలు, పురాణాలు అన్నీ డొల్ల అని మాత‌మ్మ ఒక్క మాట‌లో అడిగింది.

ఈ క‌థ‌ల్లో ప‌ల్లెటూరి స్త్రీలు, న‌గ‌ర మ‌హిళ‌లు ఉన్నారు. భాష మారినా బాధ ఒకటే. మంచి శిల్పం, చ‌దివించే గుణం, అన్నిటికీ మించి ఆలోచ‌న పుట్టించే అగ్గి ల‌క్ష‌ణం ఉన్నాయి. తెలుగు క‌థ‌ల్లో ఝాన్సీ వినిపించే పేరు, క‌నిపించే పేరు.

జీఆర్ మ‌హ‌ర్షి