భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణలో ఆమె పర్యటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలుకుతారా? లేదా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో… అందరూ ఊహించినట్టుగానే సీఎం వెళ్లలేదు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారులు స్వాగతం పలకడం గమనార్హం.
ద్రౌపదిని ఆహ్వానించడానికి సత్యవతిని పంపడం వెనుక కేసీఆర్ వ్యూహం వుంది. రాష్ట్రపతిగా మొట్టమొదటిసారిగా ఓ గిరిజన తెగకు చెందిన మహిళను బీజేపీ ఎంపిక చేసింది. ఆమెకు మద్దతు ఇవ్వాలని పార్టీలకు అతీతంగా ద్రౌపది విన్నవించారు. కానీ బీజేపీతో బీఆర్ఎస్‌కు గొడవల నేపథ్యంలో కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు. మమతాబెనర్జీ బలపరిచిన యశ్వంత్‌సిన్హాకు బీఆర్ఎస్ తన సంపూర్ణ మద్దతు పలికింది.
ఈ నేపథ్యంలో ద్రౌపది గెలుపొందారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆమెకు ద్రౌపది సామాజిక వర్గానికి చెందిన మంత్రి సత్యవతిని కేసీఆర్ సర్కార్ పంపడం విశేషం. మహిళ కావడంతో పాటు ఒకే సామాజిక వర్గానికి పంపడం వెనుక రాజకీయ వ్యూహం వుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ వెళ్లకపోవడంపై ఒకట్రెండు మీడియా సంస్థలు వివాదం చేయడానికి ప్రయత్నించడం గమనార్హం.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనానికి ద్రౌపది ముర్ము వెళ్లారు. ఏపీ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి ఆమె హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. హెలికాప్టర్‌లో సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారనే ప్రచారం జరుగుతోంది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ఐదు రోజులు బస చేయనున్నారు.