జెడ్పీటీసీ స‌భ్యుడి దారుణ హ‌త్య‌

సిద్ధిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ స‌భ్యుడు శెట్టి మల్లేశం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఇవాళ ఉద‌యం మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. గుర్జకుంట వద్ద ఆయ‌నపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు గొడ్డ‌ళ్లు, క‌త్తుల‌తో దాడికి తెగ‌బ‌డ్డారు.…

సిద్ధిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ స‌భ్యుడు శెట్టి మల్లేశం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఇవాళ ఉద‌యం మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. గుర్జకుంట వద్ద ఆయ‌నపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు గొడ్డ‌ళ్లు, క‌త్తుల‌తో దాడికి తెగ‌బ‌డ్డారు. ఈ దాడిలో ఆయ‌న త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు.

హుటాహుటిన కుటుంబ స‌భ్యులు వ‌చ్చి ఆయ‌న్ని సిద్ధిపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన వైద్యం కోసం జెడ్పీటీసీ స‌భ్యుడిని సికింద్రాబాద్‌లోని య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. దీంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  

ఇత‌ను టీఆర్ఎస్ నుంచి ప్రాతినిథ్యం వ‌హించారు. అధికార పార్టీ జెడ్పీటీసీ స‌భ్యుడే హ‌త్య‌కు గురి కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి వుంది. రాజ‌కీయ ప‌ర‌మైన హ‌త్యా లేక ఆస్తి, వ్యాపార సంబంధిత త‌గాదాల వ‌ల్ల ప్రాణాలు కోల్పోయాడా? అనేది పోలీసుల ద‌ర్యాప్తులో తేలాల్సి వుంది. 

ఇదిలా వుండ‌గా మునుగోడు ఉప ఎన్నిక‌కు ముందు ఖ‌మ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన అనుచ‌రుడు హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో సీపీఎం రాష్ట్ర నాయ‌కుడు త‌మ్మినేని వీర‌భ‌ద్రం పాత్ర ఉంద‌ని బాధితులు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా అధికార పార్టీ ఆ కేసును నీరుగారుస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. మ‌రిప్పుడు ఈ కేసును ఏం చేస్తుందో చూడాలి.