తెలంగాణ కాంగ్రెస్ కు రోగాలు నయంచేసే ప్రాసెస్ లో రోగం ఒకచోట ఉంటే మందు మరొకరచోట వేస్తున్నారా? పార్టీలో ఎంతో సీనియర్ నాయకుల్లో ఒకడైన డిగ్గీ రాజా.. కొండంతరాగం తీసి లొల్లాయి పాట పాడుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో ముఠాతగాదాలను చక్కదిద్దడానికి ప్రత్యేకంగా దూతగా వచ్చిన డిగ్గీరాజా.. మొత్తానికి అయిదు సూత్రాల ప్రణాళికను సిద్ధంచేసి హైకమాండ్ కు అప్పగించేశారు. కానీ.. ఆయన సూచించిన మందు పార్టీ పునర్నిర్మాణానికి పనిచేస్తుందా? అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది.
టీపీసీసీలో ఉండే నాయకులందరికీ రేవంత్ మీద ఆగ్రహం ఉంది. ఆయన మీద వ్యతిరేకత ఉంది. ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకే పార్టీ ఇన్చార్జి మాణిక్కం టాగూర్ మీద కూడా ఆగ్రహం ఉంది. టీపీసీసీ నియామకాల విషయంలో కేవలం రేవంత్ రెడ్డి మాట మాత్రమే చెల్లుబాటు అయిందని.. ఇతరనాయకుల విజ్ఞప్తులు పట్టించుకోలేదనేది వారి ప్రధాన ఆరోపణ.
అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ప్రధానమైన సమస్య పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తానని, ఏ రకంగా పార్టీకి తిరిగి జీవం పోస్తానని అధిష్ఠానానికి ఆయన హామీ ఇచ్చి అధ్యక్షపదవిని తాను పొందారో తెలియదు గానీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే.. రేవంత్ రెడ్డి అనే ఏక వ్యక్తి పార్టీ లాగా మాత్రమే నడుస్తోంది.
నిజానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వృద్ధులు కూడా ఉన్నారు. పార్టీకి మాత్రమే కట్టుబడిన కమిట్మెంట్ ఉన్న సీనియర్లు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వారెవ్వరికీ ప్రాధాన్యం ఇవ్వకుండా, కనీసం సంప్రదించకుండా.. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో ముందుకెళ్లడం ఖచ్చితంగా వారందరికీ కూడా ఆగ్రహం తెప్పిస్తుంది. ఇప్పుడు ఎదురవుతున్న ప్రధానమైన సమస్య అదే.
అయితే డిగ్గీరాజా లాంటి సీనియర్ ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దడానికి వచ్చినప్పుడు.. అందరినీ కూర్చోబెట్టి ఆ విభేదాలు తొలగడానికి నాయకులు కలిసి మాత్రమే కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శనం చేసి ఉండాలి. అలాంటిదేమీ చేయకుండా.. కేవలం మాణిక్కం టాగూర్ స్థానంలో సీనియర్ ను నియమించాలనే సూచనతో ఆయన ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇన్చార్జి మారినంత మాత్రాన.. టీపీసీసీకి పట్టిన దరిద్రం వదలుతుందా.. రేవంత్ రెడ్డి సీనియర్లతో కలిసి పనిచేయకుండా.. తనంత తానుగా చేసుకుంటూ ఉంటే పార్టీ బతుకుతుందా? అనేది పెద్దప్రశ్న.