అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా బిజెపి జనసేన పార్టీలు కలిసి సుపరిపాలనపై ఒక సదస్సు నిర్వహించాయి. ఈ రెండు పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు. సహజంగానే రాష్ట్రప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. ఇరుపార్టీల నాయకులు అదే ఎజెండాగా చెలరేగిపోయారు. ప్రజల భూముల్ని సైతం ఆక్రమించుకుంటున్నారంటూ బిజెపి నాయకులు రెచ్చిపోతే.. అరాచక పాలన, అక్రమ కేసుల గురించి జనసేన నాయకులు మాట్లాడారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఈ రెండు పార్టీలు కలిసి నిర్వహించిన సమావేశం ద్వారా.. జనసేన పార్టీ తమను అవమానించిందనే భావన భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కలుగుతోంది. తమ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్థాయి నాయకులు పాల్గొన్న సమావేశానికి, జనసేన తరఫున పోతిన వెంకటమహేష్, శ్రీనివాసయాదవ్ వంటి మూడోశ్రేణి నాయకులను పంపడం తమకు అవమానంగా బిజెపి భావిస్తోంది. జనసేన నుంచి పవన్ కల్యాణ్ వచ్చి ఉంటే గౌరవప్రదంగా ఉండేదనేది వారి భావన. కనీసం నాదెండ్ల మనోహర్ స్థాయి సెకండ్ గ్రేడ్ లీడర్ కూడా కాకుండా.. వీరిని పంపడం తమను అవమానించడమే అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ రెండు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి కార్యక్రమం నిర్వహించినంత మాత్రాన వీరి మధ్య మైత్రీబంధం పటిష్టంగా ఉన్నట్టే అనుకోవడానికి వీల్లేదు. అలా జనం అనుకోకుండానే.. జనసేననుంచి పెద్ద నాయకులు రాలేదనేది పలువురి భావన. కాగా, కార్యక్రమంలో మాట్లాడుతూ జీవీఎల్ నరసింహారావు.. ప్రభుత్వ వైఫల్యాలపై జనసేనతో కలిసి పోరాడుతాం అని చాలా స్పష్టంగా ప్రకటించారు. బిజెపి నేతలంతా రెండు పార్టీలు కలిసి పోరాడుతూ, అధికారంలోకి రావడం గురించి సెలవిచ్చారు. అయితే బిజెపితో బంధం ఇలాంటి మాటలతో ముడిపడే కొద్దీ.. అది పవన్ కల్యాణ్ కు మరింత ప్రమాదకరంగా మారుతుందనేది పలువరు అంచనాగా ఉంది.
ఎందుకంటే.. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబునాయుడు పల్లకీ మోయాల్సిందే అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో దూసుకెళుతున్నారు. అదే సమయంలో బిజెపి దళాలు మాత్రం.. రాష్ట్రంలో ఎవరు గెలిచి ఎవరు నాశనమైపోయినా పరవాలేదు. పవన్ కల్యాణ్ బలాన్ని వాడుకుని మహా అయితే కాసిని సీట్లు గెలిస్తే తమకు చాలు. రాష్ట్రవ్యాప్తంగా ఓటు షేర్ శాతాన్ని పెంచుకోవడం మాత్రం జరగాలి.. అనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. అధికారం గురించి వారికి ఎలాంటి కోరిక లేదు.
కానీ పవన్ కల్యాణ్ సంగతి అలాకాదు. చంద్రబాబునాయుడును అధికారంలో కూర్చోబెట్టాలి. ఆ అధికారంలో తాను కూడా వాటా పంచుకోవాలి. ఆ వైభవాన్ని కూడా అనుభవించాలి అని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడిలాంటి కార్యక్రమాలతో బిజెపితో బంధం ముడిపడిపోతే.. అందులోంచి బయటకు రావడం పవన్ కు కష్టమైపోతుంది. బిజెపి కౌగిలించుకుంటే.. విడదీసుకుని రావడం కష్టం. అందుకనే ఆయన చాలా తెలివిగా ఉమ్మడిగా నిర్వహించదలచుకున్న కార్యక్రమానికి తమ పార్టీ ముఖ్యనేతలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డట్టుగా కూడా విశ్లేషకులు అనుకుంటున్నారు.