మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి టీడీపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకులు అప్రమత్తమయ్యారు. తమ భవిష్యత్‌పై సీరియస్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి కొంత కాలంగా రానున్న రోజుల్లో రాజకీయంగా అనుసరించాల్సిన పంథాపై సన్నిహితులతో సీరియస్‌గా చర్చిస్తున్నారని సమాచారం.
గతంలో వైసీపీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రావడం, ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. సీఎం జగన్‌పై ఆది పలుమార్లు వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో ఆయనపై సీఎం జగన్‌తో పాటు వైసీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. అసలే జగన్ కక్ష కడితే ఎవరినీ వదిలి పెట్టరని ఆదినారాయణరెడ్డికి బాగా తెలుసు.
అందుకే ఆయన ఎంతకైనా మంచిదని బీజేపీ పంచన చేరారు. ప్రస్తుతం బీజేపీ గొడుగు కింద ఆదినారాయ ణరెడ్డి సురక్షితంగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా బీజేపీకి భవిష్యత్ లేదనే సంగతి ఆయనకు బాగా తెలుసు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన అన్వేషిస్తున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటే పార్టీ మారాల్సిన అవసరం లేదనేది ఆయన భావన. కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి సంకేతాలు లేవు. ఇక బీజేపీనే నమ్ముకుంటే భవిష్యత్ వుండదనే ఉద్దేశంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్టు కడప జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఆయన అన్న కుమారుడు భూపేష్ జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌గా విస్తృతంగా తిరుగుతున్నాడు. రానున్న ఎన్నికల్లో ఆయనే పోటీ చేయనున్నారు. దీంతో టీడీపీలో చేరినా తనకు జమ్మలమడుగు నుంచి అవకాశం దక్కదనే నిర్ణయానికి ఆదినారాయణరెడ్డి వచ్చారు. అందుకే ఆయన ప్రొద్దుటూరు టికెట్‌ను ఆశిస్తున్నారు. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పొలిట్‌బ్యూరో స్థానం కల్పిస్తామని ఆ పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇందుకు ఆదినారాయణరెడ్డి కూడా సుముఖత వ్యక్తి చేసినట్టు తెలిసింది. ప్రొద్దుటూరు టికెట్‌పైనే ఇంకా తేల్చి చెప్పలేదని సమాచారం. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరితే కడప జిల్లాలో టీడీపీకి బలం పెరుగుతుంది. అందుకే ఆయన్ను చేర్చుకునేందుకు టీడీపీ ఆసక్తి చూపుతోంది. రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చు.