మాజీ మంత్రి, కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం ఇవాళ కోనసీమ పెద్దలకు బహిరంగ లేఖ రాశారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సమర్థిస్తూ ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం అమలాపురంలో విధ్వంసానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కోనసీమలో కులపరమైన విభజనకు జగన్ ప్రభుత్వ చర్య కారణమైందనే విమర్శలు వెల్లువెత్తాయి.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును ఆలస్యంగా పెట్టడం వల్లే అలజడికి కారణమైందని జనసేనాని పవన్‌కల్యాణ్ తప్పు పట్టారు. నిజంగా అంబేద్కర్‌పై జగన్‌కు అంత ప్రేమే వుంటే, తన జిల్లాకు పెట్టుకోవచ్చు కదా అని పవన్‌కల్యాణ్ ఉచిత సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పెద్దలకు ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం గమనార్హం. ఆ లేఖలోని ముఖ్యాంశాలేంటో చూద్దాం.
“నేనేమీ పెద్ద మేధావిని కాదు, పెద్దగా చదువుకోలేదండి. కానీ ఈ మధ్య మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనల గురించి మీడియా, స్నేహితుల ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. మనమంతా సోదర భావంతో మెలగాల్సిన సమయంలో కులాలు, మతాల కుంపట్లలో మగ్గిపోతున్నామని ఈ లేఖ రాయాలనిపించి రాస్తున్నాను. మీ మనోభావాలకు ఇబ్బందిగా వుంటే పెద్ద మనసుతో క్షమించండి.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన పుట్టిన రాష్ట్రమే కాదు దేశంతో పాటు యావత్ ప్రపంచమే కొనియాడుతోంది. అలాంటి మహావ్యక్తి పేరు కోనసీమ జిల్లాకు పెట్టినందుకు అలజడులు సృష్టించడం న్యాయంగా లేదు. అంబేద్కర్ పేరు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా ఎవరూ కాదనరని నా భావన. న్యాయంగా జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలి. ఏదో కారణంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు.
జిల్లాలకు పేర్లు పెట్టినంత మాత్రాన ఆ జిల్లాలు ఆ పేర్లున్న వారి ఆస్తులుగా మారిపోవు కదా? అలాంటప్పుడు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడం న్యాయమంటారా? ఆలోచించండి. ఇలాంటి వ్యక్తి పేరు మన ప్రాంతానికి పెట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనందరికి హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం రాసిన వ్యక్తిని గౌరవించాలా? వద్దా? ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మనమెంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నది నగ్న సత్యం. నిజం కూడా. భారత రాజ్యాంగ పిత అంబేద్కర్.
గౌరవ పెద్దలకు చేతులెత్తి నమస్కరిస్తూ మరోసారి కోరుతున్నా. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కుడుపూడి సూర్యనారాయణరావు, కల్వకొలను తాతాజీ గార్లు సమస్యకు ముగింపు పలకడానికి ఆలోచన చేయాలని కోరుతున్నా. నేను ఏ స్వార్థంతోనూ ఈ లేఖ మీకు రాయలేదు. మీరంతా సంతోషంగా ఉండాలనేది నా కోరిక” అంటూ పద్మనాభం లేఖ రాశారు.
ఆల్రెడీ కోనసీమకు అంబేద్కర్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతానికి అక్కడి ఎలాంటి అలజడి లేదు. కానీ ఇప్పుడే ఈ లేఖ ఎందుకు రాశారనేది చర్చనీయాంశమైంది. లేఖ ద్వారా అప్పీల్ మాత్రం ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసేలా ఉంది. ఇంకా ఎవరిలోనైనా చిన్నచిన్న అసంతృప్తులు, వ్యతిరేకతలు వుంటే పోగొట్టాలని ముద్రగడ విజ్ఞప్తి అభినందనీయం.