ఆయనకు మూడు చాన్సులు.. నాకు ఒక్క చాన్స్!

ఎన్నికల్లో ఒక్కొక్కరిది ఒక్కో తరహా ప్రచారం. ప్రజలకు ఏది హత్తుకుంటుంది అన్నది చూసి మరీ ఎన్నికల నినాదాలను తయారు చేసుకుంటున్నారు. విశాఖలో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న నియోజకవర్గం విశాఖ తూర్పు. ఇక్కడ…

ఎన్నికల్లో ఒక్కొక్కరిది ఒక్కో తరహా ప్రచారం. ప్రజలకు ఏది హత్తుకుంటుంది అన్నది చూసి మరీ ఎన్నికల నినాదాలను తయారు చేసుకుంటున్నారు. విశాఖలో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న నియోజకవర్గం విశాఖ తూర్పు. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

ఆయన అందరి కంటే ముందే ప్రచారం ప్రారంభించారు. పాదయాత్ర చేస్తూ నియోజకవర్గం అంతా కలియ తిరుగుతున్నారు. ఆయన ప్రతీ ఇంటికీ వెళ్ళి ఓటు వేయమని అర్ధిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చెబుతున్న మాట ఒక్కటే ఉంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుని మూడు సార్లు గెలిపించారు. పదిహేనేళ్ళలో ఆయన ఏమి చేసారో మీకే ఎక్కువగా తెలుసు.

ఈసారి నాకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను అని అంటున్నారు. తాను ఎంపీగా ఉండగానే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అని గుర్తు చేస్తున్నారు. తనకు ఒక్క చాన్స్ అని ఆయన అడుగుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఒక్క చాన్స్ అన్నది జనంలోకి బలంగా వెళ్తుంది అని వైసీపీ నమ్ముతోంది.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉందని వైసీపీ భావిస్తోంది. అందువల్ల దానిని సొమ్ము చేసుకోవడానికి వెలగపూడికి మూడు చాన్సులు అని పదే పదే గుర్తు చేస్తోంది అధికార పార్టీ. జనంలో ఇది చర్చకు పెడుతోంది.

ఒకే నాయకుడికి ఇన్ని చాన్సులు ఇవ్వడం కాదు కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతోంది. రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల కంటే ఇది జనంలో ఆలోచనలు రేపుతుందని వైసీపీ భావిస్తోంది. జనాలకు కూడా మార్పు రావాలని ఉంటుంది. దాన్ని వైసీపీ తట్టి లేపుతోంది. ఇది కనుక ఫలిస్తే విశాఖ తూర్పు వంటి టీడీపీ కంచుకోటకు బీటలు వారడం ఖాయమని అంటున్నారు.