భీమునిపట్నం సీటు అంటే అందరికీ ఇష్టం. ఆ సీటు మీద ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం అన్న నందమూరి తారక రామారావు కూడా మోజు పడ్డారు. చివరి నిముషంలో ఆయన మనసు మార్చుకుని టెక్కలికి వెళ్లారు. అక్కడ నుంచి గెలిచారు కూడా.
ఇంతకీ భీమిలీ విషయం చెప్పుకుంటే ఈ సీటు విశాఖలో చొచ్చుకుని పోయి ఉంటుంది. భీమిలీ ప్రజలు సౌమ్యులు. కొత్త వారికి అయినా ఆదరిస్తారు. అలాగే పార్టీలు అంటే కట్టుబడిపోతారు. భీమిలీ టీడీపీకి కంచుకోట.
కానీ గత నాలుగు ఎన్నికలు చూస్తే ఒకే ఒకసారి గెలిచింది. ఈ రోజుకీ మంచి క్యాండిడేట్ ని పెడితే టీడీపీ గెలుస్తుంది. అందుకే భీమిలీ మీద టీడీపీలో పోటీ ఎక్కువ అయిపోయింది. విశాఖ ఎంపీ సీటు కనుక తనకు దక్కకపోతే భీమిలీ అసెంబ్లీ సీటు ఇవ్వాలని బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పట్టుబడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ఆయన గీతం విద్యా సంస్థలు భీమిలీలో ఉన్నాయి. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తే భీమిలీలో మెజారిటీ దక్కింది. ఆయన ప్లాన్ బీ లో భాగంగా భీమిలీలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఇక అనకాపల్లి సీటు బీజేపీకి ఇస్తే తనకు భీమిలీ నుంచి పోటీ చేస్తే చాన్స్ ఇవ్వాలని ఒక బిగ్ షాట్ అయిన పారిశ్రామిక వేత్త కూడా కోరుతున్నారుట. ఆయన బలమైన సామాజిక వర్గం నేపధ్యం కలసివస్తుందని ఆశిస్తున్నారుట.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలీ తనకే కేటాయించాలని కోరుతూ ఉన్నారు. భీమిలీ ఇస్తే గెలిచి వస్తానని కూడా చెబుతున్నారు. ఇప్పటికే గంటా అనేక సర్వేలు కూడా సొంతంగా చేయించుకుంటే గెలుస్తామని వచ్చిందట.
భీమిలీ టీడీపీ ఇంచార్జి మాజీ ఎంపీపీ అయిన రాజబాబు కూడా తనకే సీటు అని కోరుకుంటున్నారు. ఆయన తనకు సీటు ఇవ్వడం న్యాయం అని అంటున్నారు. నెల్లిమర్ల టికెట్ జనసేనకు ఇవ్వడంతో అక్కడ ఇంచార్జి భీమిలి వైపు చూస్తున్నారు. ఆయన కూడా తనకు సీటు ఇస్తే గెలిచి వస్తానని చెబుతున్నారు. అయితే బాలయ్య అల్లుడుకే ఈ సీటు రిజర్వ్ చేశారు అని అంటున్నారు. విశాఖ ఎంపీ టికెట్ బీజేపీకి ఇస్తే మాత్రం బాలయ్య అల్లుడే భీమిలీ టీడీపీ అభ్యర్ధి అని అంటున్నారు.