‘ప్రధాని నరేంద్రమోడీ అంతటి నాయకుడు వచ్చి శంకుస్థాపన చేసినా సరే.. అమరావతి నగర నిర్మాణం పూర్తికాలేదు. దానిని ఎక్కడిదక్కడే వదిలేశారు’ ఈ వాక్యాలు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా చెప్పినవి. ఈ మాటలు వింటే నవ్వొస్తోంది. మోడీ జమానా మొదలైన తర్వాత బిజెపిలో కూడా కాంగ్రెస్ తరహా వ్యక్తిపూజ పెరిగింది. పార్టీ నాయకులు నరేంద్రమోడీని దేవుడిగా కీర్తించడమూ, భగవంతుడి అంశతోనే నరేంద్రమోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని భజన చేయడమూ కూడా పెరిగింది.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మోడీ చరిష్మా అనేది ఖచ్చితంగా ఒక బలమైన అంశంగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా కొన్ని మరకలు ఉన్నప్పటికీ, పారదర్శకమైన అభివృద్ధి ఫోకస్ తో కూడిన పాలన అందించడం అనేది మోడీకి దేశవ్యాప్తంగా పాజిటివ్ ఇమేజి పెంచింది. దానివలన ఆయన ప్రధాని అవుతారంటే.. దేశం జైకొట్టింది. అంతమాత్రాన మోడీని దైవాంశ సంభూతుడిగా ఆరాధించే దశకు బిజెపి శ్రేణులంతా దిగజారిపోయాయి.
ఇప్పుడు జెపి నడ్డా మాటల్లో కూడా అలాంటి ధోరణే కనిపిస్తోంది. మోడీ శంకుస్థాపన చేసిన కూడా రాజధాని నగరం పూర్తి కాలేదు.. అనడంలో ఆయన ఆంతర్యం ఏమిటో తెలియదు. మోడీ ఏమైనా మెజీషియన్ అనుకుంటున్నారా? ఆయన శంకుస్థాపన చేస్తే ఏదైనా చిటికెలో పూర్తయిపోతుందని భ్రమిస్తున్నారా? ‘‘మోడీ అంతటి నాయకుడు.. పొయ్యి వెలిగించారు.. కానీ బిర్యానీ ఇంకా రెడీ కాలేదు’’ అంటే ఎలా? బిర్యానీ కావాలంటే పొయ్యి వెలిగించి పారిపోతే చాలదు. బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, అందులో వేయదగిన ఇతర పదార్థాలన్నీ కావాలి. అవేమీ ఇవ్వకుండా, లేకుండా పొయ్యి వెలిగించేశాను కదా.. బిర్యానీ ఎక్కడ అని అడిగితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
చంద్రబాబునాయుడు జమానాలో మోడీని అమరావతి నగరానికి శంకుస్థాపన చేయడానికి పిలిచిన మాట వాస్తవం. అప్పట్లో కేంద్ర సర్కారులో తెలుగుదేశం భాగస్వామి కూడా కనుక.. మోడీన ఇంప్రెస్ చేయడానికి బాబు పిలిచారు. పైగా.. ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తే.. ఇబ్బడి ముబ్బడిగా నిధులు విదులుస్తారని బాబు ఆశపడి ఉండవచ్చు. కానీ ప్రధానిగా నరేంద్రమోడీ చెంబుడు గంగాజలం, పిడికెడు మట్టి తెచ్చి అమరావతి మొహాన కొట్టి వెళ్లిపోయారు.
ఆంద్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని నడ్డా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోజున కేంద్రం కాస్త ఉదారంగా వ్యవహరించి.. రాజధాని నిర్మాణానికి ఏ కొంతైనా సహకారం అందించి ఉంటే.. అక్కడ కీలక నిర్మాణాలు ఎప్పుడో పూర్తయి ఉండేవి. పోలవరం విషయంలో జాతీయ ప్రాజెక్టు గనుక.. వారు ఇచ్చి తీరాల్సిన నిధుల విషయంలోనే నాన్చుడు ధోరణితో సాగదీస్తున్న కేంద్రం, అమరావతిని అసలు పట్టించుకోలేదు.
ఏ అర్హతతో అమరావతి పూర్తి కాలేదేం? అని నడ్డా అడుగుతున్నారో తెలియదు. మోడీ మేజిక్ షో తో నగర నిర్మాణం సాధ్యమవుతుందని అనుకున్నారేమో తెలియదు.