‘ఒక్క చాన్స్’ అడిగేందుకు నోరెలా వస్తుందో?

యావద్దేశంతో పాటు తెలుగు ప్రజలు కూడా వారి మాటలు నమ్మి.. సంపూర్ణమైన అధికారం కట్టబెట్టి వారికి అవకాశం ఇచ్చారు. అందుకు జవాబుగా వారు తెలుగు ప్రజలకు చేసిందేమిటి.. కేవలం వంచన! అయిదేళ్లు కాదు మీకు…

యావద్దేశంతో పాటు తెలుగు ప్రజలు కూడా వారి మాటలు నమ్మి.. సంపూర్ణమైన అధికారం కట్టబెట్టి వారికి అవకాశం ఇచ్చారు. అందుకు జవాబుగా వారు తెలుగు ప్రజలకు చేసిందేమిటి.. కేవలం వంచన! అయిదేళ్లు కాదు మీకు పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తానని నరేంద్రమోడీ , 2014 ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో ఏపీ ప్రజలను నమ్మించారు. తెలుగుదేశంతో పొత్తుల్లో ఉన్న ఆ పార్టీకి ప్రజలు ఘనంగా సీట్లు కట్టబెట్టారు. అయితే ప్రధాని మోడీ మాత్రం ప్రత్యేకహోదా విషయంలో మొహం చాటేశారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసింది.

తీరా ఇప్పుడు, 2024 ఎన్నికలు దగ్గరపడుతుండగా.. రాష్ట్రంలో సభలు పెట్టి.. ‘ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. మాకు అవకాశం ఇస్తే రాయలసీమను ప్రగతిపథంవైపు మళ్లిస్తాం’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అంటున్నారు. మోడీ చేసిన వంచనను తెలుగు ప్రజలకు ఇంకా మరచిపోలేకపోతుండగా.. మళ్లీ వచ్చి ఒక్క చాన్స్ అడగడానికి ఆయనకు నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఏపీ ప్రజలు బిజెపిని ఎందుకు నమ్మాలో ముందు ఆయన చెప్పాలి.

ఒక్క చాన్స్ అంటే.. నడ్డా ఉద్దేశం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారికి అధికారాన్ని కట్టబెట్టాలని కావొచ్చు. అయితే కేంద్రంలో కట్టబెట్టిన అధికారానికి ఇంకా పదినెలల ఆయుష్షు ఉంది. ఈ మిగిలిన కాలంలో.. ఏపీపై ఆ పార్టీ ఏం ప్రేమ చూపించగలదో, పదేళ్ల కిందట చేసిన వాగ్దానాన్ని ఏమేరకు నిలబెట్టుకుంటుందో చూసి, ఆ తర్వాత బిజెపిని ఆదరించాలా వద్దా తెలుగు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు.

ప్రత్యేకహోదా అనే సంజీవని ఏపీ రాష్ట్రానికి దూరంచేసిన కుట్ర భారతీయ జనతా పార్టీది. అప్పట్లో తెలుగుదేశం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కూడా.. ప్యాకేజీ కోసం కక్కుర్తి పడి,హోదాను తాకట్టుపెట్టారు చంద్రబాబు. మొత్తానికి అటూ ఇటూ కాకుండా రాష్ట్రం నష్టపోయింది. కేంద్రం హోదాను పక్కన పడేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మూకుమ్మడిగా ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలేవీ వారిని కదలించలేకపోయాయి.

ప్రత్యేకహోదా విషయంలో ఏపీ ప్రజలకు చేసిన మోసాన్ని వారు మరచిపోయి ఉంటారని కమలనాధులు అనుకుంటున్నట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు సభలు పెట్టి ఒక్క చాన్స్ అడుగుతున్నారు. ఏపీలో భాజపా ఇంకా వరుస సభలు పెట్టబోతోంది. శ్రీకాళహస్తిలో జెపి నడ్డా సభ తర్వాత, ఆదివారం నాడు విశాఖలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. బహుశా ఆయన కూడా ఇదే తరహా మాటల గారడీ ప్రదర్శిస్తారేమో. వీరు ఏపీ ప్రజల ఎదుట ఇలాంటి గారడీలు చేసేముందు.. విభజన వల్ల దారుణంగా నష్టపోయి అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేకంగా తాము ఏం చేస్తున్నామో చెబితే బాగుంటుంది.