చంద్ర‌బాబు ఓకే చెప్పారా.. నాదెండ్లా?!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ను తెనాలి నుంచినే పోటీ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించుకున్నారు జ‌నసేన ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్. జ‌న‌సేన‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్వాత నాదెండ్లే క‌నిపిస్తూ ఉన్నారు. నాదెండ్ల త‌ర్వాత మాత్రం ఇంకెవ్వ‌రూ క‌నిపించ‌డం…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ను తెనాలి నుంచినే పోటీ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించుకున్నారు జ‌నసేన ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్. జ‌న‌సేన‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్వాత నాదెండ్లే క‌నిపిస్తూ ఉన్నారు. నాదెండ్ల త‌ర్వాత మాత్రం ఇంకెవ్వ‌రూ క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ‌కు వెళ్లినా వెంట నాదెండ్ల ఉంటారు. 

ఒక్క చంద్ర‌బాబుతో స‌మావేశాల‌కే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒంట‌రిగా వెళ్తారు. అక్క‌డ మాత్రం నాదెండ్ల క‌నిపించ‌రు. ఏదేమైనా జ‌న‌సేన‌ల‌లో కీల‌క స్థానంలో ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌న‌కు ఇంకా పోటీ చేసే ఆస‌క్తి ఉంద‌ని స్ప‌ష్టం చేశాడు. అది తెనాలి నుంచినే అని ఆయ‌న అంటున్నారు.

తెనాలి నుంచి చివ‌రి సారి నాదెండ్ల మ‌నోహ‌ర్ 2009లో నెగ్గారు. అప్పుడే ఆయ‌న‌కు డిప్యూటీ స్పీక‌ర్ గా అవ‌కాశం ద‌క్కింది. స్పీక‌ర్ హోదా నుంచి కిర‌ణ్ సీఎం అయిపోవ‌డంతో, నాదెండ్ల మ‌నోహ‌ర్ కు స్పీక‌ర్ ఛాన్సు కూడా ద‌క్కింది. 

కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడిగా ఈయ‌న వ్య‌వ‌హ‌రించారు. నాదెండ్ల భాస్క‌ర‌రావు రాజ‌కీయ వార‌సుడిగా నాదెండ్ల మ‌నోహ‌ర్ 2004, 2009 ఎన్నిక‌ల్లో తెనాలి నుంచి నెగ్గారు. 2004లో ప‌న్నెండు వేల ఓట్ల మెజారిటీ పొందిన మ‌నోహ‌ర్, 2009లో మాత్రం కేవ‌లం రెండు వేల స్థాయి మెజారిటీతో బ‌య‌ట‌పడ్డారు. ఇలాంటి బొటాబోటీ నేత జ‌న‌సేన‌లో కీల‌క నేత‌గా ఉన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో కూడా నాదెండ్ల మ‌నోహ‌ర్ తెనాలి నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేశారు. కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ మ‌ద్ద‌తుతో జ‌న‌సేన అభ్య‌ర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్ సుమారు ముప్పై వేల స్థాయి ఓట్ల‌ను పొందారు. 2014లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా నాదెండ్ల మ‌నోహ‌ర్ 15 వేల ఓట్ల‌ను సాధించారు. 

సొంతంగా 15 వేల ఓట్ల‌ను సాధించ‌గ‌ల స‌త్తా ఉన్న‌ట్టుంది నాదెండ్ల మ‌నోహ‌ర్ కు తెనాలిలో. అదే జ‌న‌సేన బ‌లాన్ని క‌లుపుకుంటే ముప్పై వేల ఓట్లు అవుతున్నాయి. మ‌రి టీడీపీ-జ‌నసేన‌లు పొత్తుతో పోటీ చేస్తే ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. అయితే తెనాలి నుంచి త‌నే పోటీ అంటూ నాదెండ్ల ప్ర‌క‌టించుకుంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఈ మేర‌కు భ‌రోసా ఇచ్చారో లేదో నాదెండ్ల చెప్ప‌డం లేదు. 

జ‌న‌సేన వ‌ర‌కే అయితే నాదెండ్ల‌కు టికెట్ విష‌యంలో పోటీ లేన‌ట్టే. అయితే టీడీపీ నుంచి ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ ఊరికే ఉంటారా? పొత్తులో భాగంగా ఆయ‌న టికెట్ త్యాగం చేసేస్తారా?