నాగబాబు జనసేన నాయకుడు. ఆయన పవన్ కళ్యాణ్ అన్న గారు. ఆయన వస్తే జనసేన పార్టీ నేతలకు సందడి. ఆయన కూడా వారినే పిలిపించుకుంటారు. వారితోనే సమీక్షలు చేస్తూ ఉంటారు. నాగబాబు గత నాలుగైదు రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉంటూ అదే పనిగా పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు.
నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పోటీకి దిగుతారు అని ప్రచారంలో ఉన్న మాట. దానికి అనుగుణంగా ఆయన పొలిటికల్ గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగా విశాఖ జిల్లా టూర్లు పెట్టుకున్నారు అని అంటున్నారు.
నాగబాబు విశాఖ వచ్చిన తరువాత జనసేన నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయనను కలుసుకుంటున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ నాగబాబు ఉన్న హొటల్ వద్దకు వచ్చి రెండు రోజుల క్రితం కలసి వెళ్లారు. ఆ మీటింగ్ ఏమిటి అన్నది తెలియలేదు.
ఇప్పుడు మరో తలపండిన రాజకీయ నేత కూడా నాగబాబుని అదే హొటల్ లో కలిశారు. పెందుర్తికి చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి నాగబాబుని ప్రత్యేకంగా కలసి మంతనాలు జరిపారు. ఆయన పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. పొత్తులో అది జనసేన కోరుతోంది.
దాంతో ఆయన నాగబాబు తో ఈ విషయంలో ఏమైనా చర్చించారా అన్నది చూడాలి. జనసేనకే ఈ టికెట్ ఇస్తే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కంటే తమ్మిరెడ్డి శివశంకర్ బెటర్ క్యాండిడేట్ అని ఆయనకు మద్దతుగా చెప్పడానికి ఈ మాజీ మంత్రి వచ్చారు అని మరో ప్రచారం ఉంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల తీరు పట్ల జనసేనలో సీనియర్లు మండిపోతున్నారు. టీడీపీలో కూడా మాజీ మంత్రి ఆయన వద్దు అని చెప్పారని ప్రచారం సాగుతోంది.
అంతే కాకుండా జిల్లా రాజకీయాల మీద కూడా నాగబాబు ఈ మాజీ మంత్రి చర్చించుకున్నారు అని తెలుస్తోంది. నాగబాబుని మరింత మంది టీడీపీ నేతలు కూడా కలుస్తున్నారు అని అంటున్నారు. ఈ కలయిక ఏమిటి దేని కోసం అన్నది మాత్రం బయటకు రాకపోయినా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటున్నారు.