జనసేన నాయకుడు నాగబాబుతో టీడీపీకి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కలవడం విశాఖ జిల్లా రాజకీయాలలో హాట్ డిస్కషన్ గా మారింది. నాగబాబు విశాఖ జిల్లాలో పర్యటన కోసం వచ్చారు. ఆయన విశాఖలో ఒక హొటెల్ నుంచి నర్శీపట్నం తో పాటు రూరల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న వేళ ఆయన కారులోకి ఎక్కే ముందు విజయ్ కలసి మాట్లాడారు.
ఇది ఆసక్తిని కలిగించే పరిణామంగా అంతా చూస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తు ఉంది. అయితే పవన్ చంద్రబాబు స్థాయిలలో భేటీలు అవుతున్నాయి. మిగిలిన చోట్ల ఏ పార్టీకి ఆ పార్టీ మీటింగులు పెట్టుకుంటోంది. అలా జనసేన పార్టీ సమీక్షలకు నాగబాబు అటెండ్ అవుతున్నారు.
అక్కడ ఉంది అంతా జనసేన నేతలే. వారి మధ్యలో అయ్యన్న కుమారుడు టీడీపీ నేత విజయ్ ఉండడం ఆశ్చర్యం అనుకుంటే ఆయన నాగబాబు కోసం వేచి చూసి ఆయనతో మంతనాలు చేయడం విశేషంగానే చెప్పుకుంటున్నారు. ఇంతకీ నాగబాబుతో విజయ్ ఏమి మాట్లాడి ఉంటారు అన్నది అందరి మదిలో ఆలోచనలు రేపుతోంది.
ఈ ఇద్దరూ కూడా అనకాపల్లి ఎంపీ సీటుకు ఆశావహులు అన్నది ప్రచారంలో ఉంది. టీడీపీ నుంచి విజయ్ ఈ సీటు ఆశిస్తున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు మాడుగుల సభకు వచ్చినపుడు వేదిక మీదనే అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి టికెట్ ఇవ్వమని కోరడం జరిగింది. బాబు ఏమి చేస్తారు అన్నది పక్కన పెడితే ఈ సీటు జనసేనకు పొత్తులో వెళ్తుందని కూడా ప్రచారం సాగుతోంది.
జనసేనకు కనుక ఈ సీటు ఇస్తే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పోటీ చేస్తారు అని నిన్నటిదాకా వినిపిస్తే ఇపుడు నాగబాబు పేరు వినిపిస్తోంది. ఆయన అనకాపల్లి నుంచి ఉమ్మడి అభ్యర్ధిగా ఉంటారు అని అంటున్నారు ఆ సీటు ఆశిస్తున్న విజయ్ నాగబాబుని కలవడమే ఇపుడు విశేషం. ఆ మీదట నర్శీపట్నంలో మీడియా నాగబాబుని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అంటే ఆ విషయం పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు.
నాగబాబు ఒకవేళ పోటీ చేయకపోతే టీడీపీ తరఫున విజయ్ పోటీకి సిద్ధం అవుతున్నారు. దానికోసమే ఆయన నాగబాబుతో మాట్లాడి ఉంటారా అన్నదే ఇపుడు రెండు పార్టీలలో చర్చగా ఉంది. నాగబాబు అయితే అఫీషియల్ గా ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది తమ పార్టీ అధినేత పవన్ ప్రకటిస్తారు అని చెప్పేశారు.