విశాఖ పశ్చిమ టీడీపీలో అసమ్మతి సెగలు !

విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఒక విధంగా టీడీపీకి కంచుకోట లాంటిది. జగన్ వేవ్ బలంగా వీచిన 2019 ఎన్నికల్లో సైతం ఈ సీటుని టీడీపీ నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు…

విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఒక విధంగా టీడీపీకి కంచుకోట లాంటిది. జగన్ వేవ్ బలంగా వీచిన 2019 ఎన్నికల్లో సైతం ఈ సీటుని టీడీపీ నిలబెట్టుకుంది. ఈ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు పెతకంశెట్టి గణబాబు విజయం సాధించారు. అంతకు ముందు ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా కూడా ఒకసారి పనిచేశారు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న గణబాబు 2024లో మరోసారి పోటీకి సిద్ధం అంటున్నారు.

అయితే ఎపుడూ ఇచ్చిన వారికేనా పార్టీ బీఫారాలు అని టీడీపీలో మరో వర్గం గుర్రుమంటోంది. ఈసారి మార్పు రావాల్సిందే అని నినదిస్తోంది. ఇచ్చిన చాన్సులు చాలు కొత్తవారికి అవకాశాలు ఇవ్వండి అని అధినాయకత్వాన్ని కోరుతోంది. విశాఖ పశ్చిమలో సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ఈసారి బలమైన మరో సామాజికవర్గానికి టికెట్ కేటాయించాలని డిమాండ్ పెరుగుతోంది.

తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న పాశర్ల ప్రసాద్ ఈసారి విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం పడుతున్నారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ సామాజికవర్గం ఓట్లు పెద్ద ఎత్తున విశాఖ పశ్చిమలో ఉన్నాయి. దాంతో ఆయన ఆ సీటు వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

ఈసారి భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని మొదట పాశర్ల ప్రసాద్ అనుకున్నారు. కానీ ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తోంది. దాంతో పాశర్ల విశాఖ పశ్చిమ వైపు దృష్టి సారించారు అని అంటున్నారు. చంద్రబాబు ఈ సీటుని సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకే ఇస్తారు అని అంటున్నారు. ఈసారి సిట్టింగులకు సీట్లు ఖాయం అని ఆయన చాలా కాలం ముందే చెప్పేశారు. అయినా సరే ఈ సీటు కోసం ఫైటింగ్ సాగుతోంది.

దానికి కారణాలు కూడా చూపిస్తున్నారు. ఒకే ఫ్యామిలీకి వరసగా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే పార్టీలో మిగిలిన వారి సంగతి ఏమిటి అని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బయటపడింది ఒకరు అయినా ఇంకా చాలా మంది ఈ సీటు మీద చూపు సారించారు అని అంటున్నారు. ఈ తగవు టీడీపీలో ఎలా తీరుతుందో చూడాలి.